Wednesday, January 22, 2025

42 రోజుల తరువాత తిరిగి విధుల్లోకి జూడాలు

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 42 రోజుల విరామం తరువాత జూనియర్ డాక్టర్లు పాక్షికంగా శనివారం తమ విధుల్లో చేరారు. ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఆన్ డ్యూటీ మహిళా డాక్టర్‌పై హత్యాచారానికి నిరసన సూచకంగా వారు ‘పని నిలిపివేత’ ఆందోళన సాగించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర, ఎమర్జన్సీ సర్వీసుల్లో తమ విధుల్లో జూనియర్ డాక్టర్లు తిరిగి చేరారు. కానీ ఔట్‌పేషెంట్ విభాగాలు (ఒపిడి)ల్లో వారు చేరలేదు. ‘మేము ఇప్పుడు తిరిగి విధుల్లో చేరసాగాం. మా సహచరులు అత్యవసర, ఎమర్జన్సీ సర్వీసుల్లో ఈ ఉదయం నుంచి ఒపిడిలకు కాకుండా తమ తమ విభాగాలకు తిరిగి వెళ్లసాగారు. ఇది పాక్షికంగా విధుల పునఃప్రారంభం మాత్రమేనన్నది మరవకండి’ అని ఉద్యమ డాక్టర్లలో ఒకరైన అనికేత్ మహతో ‘పిటిఐ’తో చెప్పారు. తమ ఇతర సహచరులు అప్పుడే రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాలకు బయలుదేరి వెళ్లారని,

తమ ప్రస్తుత నిరసనల మధ్యలోనే ప్రజారోగ్యం పట్ల తమ నిబద్ధత చాటడానికి వారు అక్కడ ‘అభయ క్లినిక్‌లు’ (వైద్య శిబిరాలు) ప్రారంభిస్తారని ఆయన తెలియజేశారు. డాక్టర్లు తిరిగి విధుల్లో చేరడంతో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమర్జన్సీ సర్వీసులు తిరిగి మామూలు స్థితికి వచ్చాయి. ‘ఇది మాకు గొప్ప ఉపశమనం. మేము వారి ఆందోళనను సమర్థిస్తాం. కాని ‘పని నిలిపివేత’ కారణంగా గత ఒక నెలగా చికిత్స పొందడం మా వంటి రెగ్యులర్ రోగులకు ఎంతో కష్టమైంది’ అని బంకూరా వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఒక రోగి దీపంకర్ జనా తెలిపారు. కాగా, పూర్వ మేదినీపూర్ జిల్లాలో వరద బాధిత పన్స్‌కురాలో ఒక అభయ క్లినిక్‌కు పలువురు రోగులు రావడం కనిపించింది. ఇది ఇలా ఉండగా,హతురాలికి న్యాయం చేయడం, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని తొలగించడం వంటి తమ కోర్కెలు నెరవేర్చడానికి ప్రభుత్వానికి మరి ఏడు రోజులు వ్యవధి ఇస్తామని, లేనిచో మరొక దఫా ‘పని నిలిపివేత’కు ఉపక్రమిస్తామని ఉద్యమ డాక్టర్లు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News