మనతెలంగాణ/ హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షను రద్దు చేశామని సంస్థ చైర్మన్, ఎండి జి. రఘుమారెడ్డి తెలిపారు. జులై 17న నిర్వహించిన రాత పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. ఈ రాత పరీక్షలో రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు, ఇతరులు డబ్బులు వసూలు చేసి కొంత మంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, రాచకొండ పోలీసులు విచారణ చేపట్టారు.
181 అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్టు ఈ విచారణలో తెలిసింది. మరింత మంది అభ్యర్థులకు ఈ వ్యవహారంలో ప్రమేయం లేకపోలేదని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. రాత పరీక్షలో జరిగిన ఈ అక్రమాలపై కొంత మంది అభ్యర్థులు కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేసి, ఈ పరీక్షను రద్దు చేయాలని సంస్థ యాజమాన్యాన్ని కోరారు. ఈ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డ వివిధ విద్యుత్ సంస్థల ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. రాత పరీక్షలో బయటపడ్డ అక్రమాలు, అభ్యర్థుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ, సంస్థ పరిధిలో 1000 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేశామని, భర్తీ కోసం త్వరలో మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని సిఎండి జి. రఘుమారెడ్డి తెలిపారు.