మనతెలంగాణ/ హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్దీకరించాలని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ కోరింది. శనివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ ప్రాంగణంలో అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ (రంగారెడ్డి)ని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. అనంతరం పలు అంశాలపై తీర్మానాలు చేశారు.
ప్రధానంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్దీకరించాలని, లేని పక్షంలో జెఎసి ఏర్పాటు చేసి ఆందోళన చేయాలని తీర్మానించారు. జీవో 317 తో నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 12.751 గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన గ్రామాలను నాలుగు గ్రేడ్‌లుగా విభజిస్తూ, క్లస్టర్ విధానాన్ని సవరించాలని కోరారు. కాంట్ట్రాక్ సిబ్బందిని క్రమబద్దీకరించి.. ఇకపై ఆ నియమాకాలను రద్దు చేయాలని కోరారు. సమావేశంలో వివిధ జిల్లాల బాధ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.