లిమా: ఇక్కడ జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎయిర్‌పిస్టల్ పురుషుల, మహిళల టీం ఈవెంట్లు రెండింటిలోను బంగారు పతకాలు సాధించారు. మహిళల ఫైనల్లో భారత షూటర్ల త్రయం రిథమ్ సంగ్వాన్, మనూ బాకర్, శిఖా నర్వాల్‌లు బెలారస్ బృందం అలియాకసండ్రా పియట్రోవా, జోయా దస్కో, అలినా నెస్ట్‌సియరోవిచ్‌లపై 16-12 తేడాతో విజయం సాధించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది పోటీల్లో మనూ బాకర్‌కు ఇది మూడో స్వర్ణం కావడం గమనార్హం. ఇంతకు ముందు ఆమె వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ఎయిర్‌పిస్టల్ ఈవెంట్స్ లోను స్వర్ణ పతకాలు దక్కించుకుంది.
పురుషుల ఫైనల్‌లో మన దేశానికి చెందిన సరబ్‌జోత్ సింగ్, నవీన్, శివ నర్వాల్‌లు బెలా రస్‌కు చెందిన అబ్దుల్ అజీజ్ కుర్ద్‌జి, ఇవాన్ కజక్, ఉలాడ్‌జిస్లావు జెమెష్‌లపై 1614 తేడాతో విజయం సాధించి బంగారు పతకం దక్కించుకున్నారు. ఆద్యంతం నువ్వా, నేనా అన్నట్లుగా సాగిన ఈ పోటీలో చివరికి విజయం భారత్‌ను వరించింది. ఎయిర్ రైఫిల్ మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత్ మరో రజత పతకాన్ని కూడా దక్కించుకుంది. ఫైనల్లో మన దేశానికి చెందిన నిషా కన్వర్, జీనా ఖిట్టా , ఆత్మికా గుప్తాలు హంగరీకి చెందిన ఎస్టర్ మెజరోస్, ఎస్టర్ డెనెస్, లెయా హోర్వత్‌ల చేతిలో 14-16 తేడాతో ఓటమి పాలయి రజతంతో సంతృప్తి చెందారు. ఆదివారం సాధించిన రెండు బంగారు పతకాలతో కలిపి భారత్ ఇప్పటివరకు ఆరు స్వర్ణాలను గెలుచుకుంది. ఇది కాక ఆరు రజత, రెండు కాంస్య పతకాలతో పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది, అమెరికా రెండో స్థానంలో, బెలారస్ మూడో స్థానంలో ఉన్నాయి.
Junior World Champion: Indian men win gold in Airpistal