అహ్మదాబాద్: సీనియర్ డాక్టర్లు తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజ్‌కు చెందిన జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. జూనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఫిర్యాదుపై కాలేజ్ మేనేజింగ్ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ హెడ్ పంపిన ఫిర్యాదులను ర్యాగింగ్ నిరోధక కమిటీ స్వీకరించినట్లు వైద్య కళాశాల ఆఫ్ పిజి డిప్లొమా కోర్సెస్ అండ్ రిసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ మీనాక్షి పారిఖ్ బుధవారం విలేకరులకు తెలిపారు.
సీనియర్ డాక్టర్లు తమను బూట్లతో, బెల్టుతో, రబ్బర్ బ్యాండ్లతో కొడుతూ హింసిస్తున్నారని, తమ చేత బలవంతంగా గుంజీలు తీయించడమేకాక చెంపదెబ్బలు కొడుతున్నారని ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. హాస్టల్‌తోపాటు ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన ఆపరేషన్ థియేటర్‌లో సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందిందని ఆమె చెప్పారు. సీనియర్ డాక్టర్లు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే వారిని సస్పెండ్ చేయడం లేదా వారి అడ్మిషన్‌ను రద్దు చేయడం వంటి కఠిన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు.