కోల్‌కతా : కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గం గోపాధ్యాయ మంగళవారం (5న) తాను రాజీనామా చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో వివిధ విద్యా సంబంధింత అంశాలపై ఆయన తీర్పులు రాజకీయ చర్చలకు దారి తీశాయి. రాజకీయ అరంగేట్రం ఆలోచన ఉన్నదా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి జస్టిస్ గంగోపాధ్యాయ నిరాకరించారు. తన రాజీనామా అనంతరం అన్ని మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ఆయన తెలిపారు. ‘కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి నేను మంగళవారం రాజీనామా చేస్తాను’
అని ఆయన ఆదివారం తన నివాసం వెలుపల విలేకరులతో చెప్పారు. మంగళవారం తొలి గంటలో రాష్ట్రపతికి తన రాజీనామా సమర్పిస్తానని జస్టిస్ గంగోపాధ్యాయ తెలియజేశారు. ఆ లేఖ ప్రతులను భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కి, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపగలనని ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది నియామక ప్రక్రియలలో అక్రమాల ఆరోపణలను దర్యాప్తు చేయవలసిందని సిబిఐని, ఇడిని ఆదేశిస్తూ ఆయన పలు ఉత్తర్వులు జారీ చేశారు.