Wednesday, January 22, 2025

మహిళల పట్ల సభ్య పరిభాష!

- Advertisement -
- Advertisement -

మహిళలను కించపరిచే మాటలను న్యాయపరిభాష నుంచి తొలగించడానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ డివై చంద్రచూడ్ నడుం బిగించడం హర్షించవలసిన పరిణామం. న్యాయమూర్తులు తమ తీర్పుల్లో ప్రస్తావించేటప్పుడు, ఇతర సందర్భాల్లో మాట్లాడేటప్పుడు మహిళలకు సంబంధించి వాడుకలో గల న్యూనమైన పదాలకు బదులు ఉపయోగించవలసిన కొత్త పదాలతో కూడిన ఒక ‘హ్యాండ్ బుక్’ ను సిజెఐ బుధవారం నాడు ఆవిష్కరించారు. మహిళల వేధింపు (ఈవ్ టీజింగ్) ఇంటామె (హౌజ్ వైఫ్), అక్రమ సంబంధం (ఎఫైర్) వంటి పదాలు న్యాయ పారిభాషిక పదకోశం నుంచి తొలగించాలని సిజెఐ గట్టిగా భావిస్తున్నట్టు స్పష్టపడుతున్నది. వాడుకలోని లింగ వివక్ష పదాలను మానుకోడం అనే పేరుతో ఈ చేతి పుస్తకాన్ని విడుదల చేశారు. రాజ్యాంగం అవతరించి 73 సంవత్సరాలు అయినప్పటికీ దేశ ప్రజలందరికీ అది ప్రసాదించిన సమాన హక్కులు ఇప్పటికీ ఎండమావుల్లానే వున్నాయి. స్త్రీ, పురుషుల మధ్య అది బొత్తిగా అమలుకు నోచుకోడం లేదు. మహిళలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు సమాజం నోరు కూడా కలుషితమవుతున్నది.

దేశ ప్రజలందరూ చట్టం ముందు సమానులేనని మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ప్రాతిపదికగా ఎవరి విషయంలోనైనా ఎటువంటి వివక్ష చూపకూడదని, రాజ్యం ఏ ఒక్కరికీ సమాన హక్కును నిరాకరించరాదని రాజ్యాంగంలోని 1418 అధికరణలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇది ఇప్పటికీ పూర్తి ఆచరణకు నోచుకోకపోడమే అత్యంత విషాదం. కులం పేరిట న్యూనంగా చూస్తున్నారు, హింసకు గురి చేస్తున్నారు. హత్యలు కూడా జరుపుతున్నారు. ఆత్మహత్యలకు పురికొల్పుతున్నారు. కింది కులస్థులు, దళితులు మామిడికాయ కోసుకు వెళితే దొంగతనం అంటగట్టి చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన ఉదంతాలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. దళితుల పట్ల ఇటువంటి అమానుషాలకు పాల్పడిన కేసుల్లో తీవ్రమైన శిక్షలు పడిన సందర్భాలు కూడా అతి తక్కువ. ఇంతటి వివక్ష రాజ్యమేలుతున్న సమాజంలో స్త్రీపై చిన్నచూపు సర్వసాధారణమైపోయింది. ఏ హక్కు అయినా ఆమెకు నేరుగా అందదు. గృహస్వామ్యంలోనూ ఆమెది రెండో స్థానమే. అలాగే సమాజంలోనూ అణిగి వుండే పరిస్థితే. ఈ నేపథ్యంలో ఆమె పట్ల ఉపయోగించే పదజాలం ఎంత న్యూనతతో కూడి వుంటుందో ఊహించవచ్చు. సిజెఐ డివై చంద్రచూడ్‌కు ఈ విషయం తెలియనిది కాదు.

ముందుగా న్యాయ వ్యవస్థలో చిరకాలంగా నాటుకుపోయి వున్న ఇటువంటి పదాలను తొలగించి వాటికి ప్రత్యామ్నాయాలను రూపొందించాలని ఆయన భావించినట్టు బోధపడుతున్నది. చెడిపోయిన మహిళ, విశ్వాసపాత్రురాలైన, వినయ విధేయతలు కలిగిన భార్య వంటి పదాలను సిజెఐ గుర్తించారు. ఇటువంటివి తరచూ న్యాయస్థానాల్లో వినిపిస్తున్నాయని భావించారు. అటువంటి వాటిని వాడకుండా వుండడం మంచిదని భావించి కొత్త పదాలను, వాక్యాలను తయారు చేశారు. ఇంత వరకు బాగానే వుంది. కాని న్యాయాధికారుల్లోనే స్త్రీని తక్కువగా చూసే మనస్తత్వం గల వారు వుండే అవకాశముంది. భారతీయత పేరుతో కుల వ్యవస్థను, స్త్రీ పురుష అసమానతను గట్టిగా కోరుకునే వారు న్యాయ వ్యవస్థలో లేకపోతే మంచిదే గాని అలాంటి అవకాశాలు తక్కువ. సంప్రదాయంగా అలవాటైన నీచపదాలను అలవోకగా ఉపయోగించడం మామూలే. దానిని మానుకోగలగడం ఆయా వ్యక్తుల వ్యక్తిగత చైతన్యం మీద ఆధారపడి వుంటుంది.

అర్ధాంగి, పతివ్రత, ధర్మపత్ని వంటి ఇంకా అనేక పదాలు స్త్రీని పురుషుడితో సమానమైన వ్యక్తిగా సమాజం గుర్తించడానికి అడ్డుపడుతున్నాయి. ముందే నిర్ధారితమైన వాడుకలోని నీచపదాలను న్యాయ నిర్ణయాలు తీసుకొనే సమయంలో వాడడం న్యాయమూర్తుల విధి నిర్వహణకు విరుద్ధమని, ప్రతి కేసును దాని మంచి చెడ్డలపై ఆధారపడి స్వతంత్ర, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోడానికి ఈ నిందాపూర్వక పదాల వాడకం దోహదం చేయదని సిజెఐ ఈ పుస్తకానికి రాసిన ముందు మాటలో పేర్కొన్నారు. మహిళలు అమిత ఉద్రేకపరులని, నిక్కచ్చిగా ఆలోచించి స్వయంగా మంచి నిర్ణయాలు తీసుకోడం చేతగాని వారని వున్న భావనను సిజెఐ నిరాకరించారు. ఒక వ్యక్తి లింగం హేతుబద్ధంగా ఆలోచించడానికి ఆ వ్యక్తికి గల శక్తినీ, సామర్థాన్నీ ఏ మాత్రం తగ్గించజాలదని ఆయన పేర్కొన్నారు.

స్త్రీని విద్యలేని వింత పశువుగా ఎల్లకాలం వుంచడంలోనే కుట్ర వున్నది. పురుషుడి కంటే తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, వృథా వ్యక్తిగా పరిగణించడం, అన్ని దశల్లోనూ, అన్నివేళలా మగవాడిపై ఆధారపడి మాత్రమే జీవించవలసిన దుస్థితిలో వుంచి, ఆర్థిక స్వాతంత్య్రం ఇవ్వకుండా భర్త లేకపోతే బతకలేని స్థితిని కల్పించడం వల్ల మహిళ పట్ల ఇటువంటి పదాలు గతంలో అలవాటులోకి వచ్చాయి. సుప్రీంకోర్టు చొరవతో స్త్రీల పట్ల సభ్యపరిభాష అలవాటులోకి రావాలని, రాగలదని కోరుకొందాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News