న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండేళ్ల పాటు (నవంబర్ 10, 2024) సీజేఐ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 44 ఏళ్ల క్రితం జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేస్తే, ఇప్పుడు ఆయన కుమారుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. ఈ ఘట్టం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి చోటు చేసుకుంది.
అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భవిచ్ఛిత్తి, ఆధార్ చట్టాన్ని మనీబిల్లుగా ఆమోదించడం తదితర కేసుల్లో జస్టిస్ డీవై చంద్రచూడ్ చారిత్రక తీర్పులు ఇచ్చారు.సుప్రీం కోర్టు కంటే ముందు అలహాబాద్, ముంబై హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పనిచేశారు. 2016 మే 13 న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. 1998 2000 మధ్య అదనపు సొలిసిటర్ జనరల్ గానూ జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు నిర్వర్తించారు. సీజేఐ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు తదితరులు హాజరయ్యారు.
పనితీరు తోనే ప్రజలకు విశ్వాసం కల్పిస్తా : సీజేఐ
సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రచూడ్ మీడియాతో మాట్లాడుతూ మాటలతో కాదు…పనితీరు తోనే ప్రజలకు విశ్వాసం కల్పిస్తానన్నారు. టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంటామన్నారు. సుప్రీం కోర్టు లో అన్ని అంశాల్లో సంస్కరణలు ప్రవేశ పెడతామన్నారు.