కొల్లాం: సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, తమిళనాడు మాజీ గవర్నరు అయిన జస్టిస్ ఫాతిమా బీవి కేరళలో గురువారం కన్నుమూశారు. ఆమె వయస్సు 96 సంవత్సరాలు. వయోవృద్ధ అనారోగ్య సమస్యలతో ఫాతిమా బీవిని కొద్ది రోజుల క్రితం కొల్లాంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమె కోలుకులేకపొయ్యారు. గురువారం మధ్యాహ్నం మృతి చెందారని అధికార వర్గాలు ప్రకటించాయి.
శుక్రవారం ఆమె అంత్యక్రియలు, ఖనన ఘట్టం పట్టణంథిట్ట జుమ్మా మసీదు వద్ద జరుగుతాయి. ఆమె మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఆమె పలు ప్రతికూల పరిస్ధితులను ఎదుర్కొంటూ తమ వృత్తిలో , గౌరవప్రద బాధ్యతల నిర్వహణలో ఘనత వహించారని సిఎం విజయన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మొట్టమొదటి జడ్జిగా పలు కీలక తీర్పులు వెలువరించారు.
కేరళ ఆమె జన్మస్థలం. న్యాయమూర్తిగా విశేషానుభవం, పలు సంవత్సరాల సేవల తరువాత రిటైర్ అయిన జస్టిస్ బీవీ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు అయ్యారు. తరువాత 1997లో ఆమెను అప్పటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ తమిళనాడు గవర్నరుగా నియమించారు.