మన తెలంగాణ/హైదరాబాద్: భారత రాజ్యాంగం ఎంతో పవిత్రమైనదని, అందులో ఉన్న నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే పేదలకు న్యాయం జరుగుతుందని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా కాగజ్ నగర్ లోని తన నివాసంలో శుక్రవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ డా.బి.ఆర్. అంబేద్కర్ ఎంతో శ్రమించి రాజ్యాంగం రూపొందించారని, పటిష్ట రాజ్యాంగంతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందన్నారు. అనంతరం పట్టణంలోని రామ్ నగర్,డా.బి.ఆర్.అంబేద్కర్ చౌక్,ఓల్ కాలనీ, డా.బి.ఆర్.అంబేద్కర్ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసి ‘ప్రజాదర్బార్ దినపత్రిక క్యాలెండర్’ ఆవిష్కరించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్,రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా అధ్యక్షులు లెండుగురే శ్యామ్ రావు, నియోజవర్గం ఇంఛార్జీ దుర్గం మోతీరాం, పట్టణ అధ్యక్షులు ముస్తఫీజ్, ఇంఛార్జీ షబ్బీర్, కౌన్సిలర్లు లావణ్య శరత్, మినాజ్ తదితరులు పాల్గొన్నారు.