హైదరాబాద్: జస్టిస్ నరసింహరెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. నరసింహరెడ్డి నిజం వైపు ఉంటారని తాము ఆశించామని, కానీ ఆయన తీరుతో తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లే ఆస్కారం ఉందన్నారు. తెలంగాణ భవన్ నుంచి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. న్యాయ విచారణ పట్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, కోర్టులు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వాలకు విచారణ చేసే అధికారం ఉండదని, ఇఆర్‌సి తీర్పుపై విచారణ చేయకూడదనే నరసింహారెడ్డి చెప్పారని, ఈ నెల 15 వరకు గడువు ఇచ్చి 11న మీడియా సమావేశం ఎందుకు పెట్టారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. జస్టిస్ నరసింహారెడ్డి నిజాయితీగా ఉంటే కమిషన్ బాధ్యత నుంచి వైదొలగాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, ఏమైనా అవినీతి జరిగితే కేంద్రం నిజానిజాలు బయటపెట్టాలన్నారు.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నారని, అప్పటి తెలంగాణ ప్రభుత్వం మాత్రం 3.90 పైసలకు విద్యుత్ తీసుకుందని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వివరణ తీసుకున్న తరువాత ఛత్తీస్ ఘడ్ వాళ్లను పిలిస్తే బాగుండేదన్నారు. దేశంలో ఏ కమీషన్ మధ్యలో లీకులు ఇవ్వలేదని, 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ పపవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని జగదీశ్ రెడ్డి వివరించారు. ఈ రోజుకు రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, విజయవాడ, ఆర్టీపీసీ నుండి సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, పారదర్శకతతోనే ప్రభుత్వ రంగ సంస్థ బి.హెచ్.ఈ.ఎల్ కు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలను అప్పగించామని, కెసిఆర్ పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.