Monday, December 23, 2024

ఘోర నేరం: జరగని న్యాయం

- Advertisement -
- Advertisement -

 

సంపాదకీయం: న్యాయం చేయడమే కాదు చేసినట్టు అనిపించాలని అంటారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు సమాజం ఆశించే రీతిలో వుండాలని, దాని భావోద్వేగ తరంగ దైర్ఘానికి అనుకూలంగా వెలువడాలని కోరుకుంటారు. అందుకు విరుద్ధంగా వుండే తీర్పులను విమర్శిస్తుంటారు. అటువంటి అరుదైన సందరం ఇప్పుడు ఎదురైంది. భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ పదవీ విరమణకు ముందు సోమవారం నాడు ఆర్థికంగా వెనుకబడిన వారి 10 శాతం రిజర్వేషన్లు సబబేనన్న తీర్పు వెలువడింది. దానితో పాటు ఒక దారుణమైన హత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు వ్యక్తులను విడుదల చేసిన తీర్పును కూడా యుయు లలిత్ ధర్మాసనం ప్రకటించింది. దీని పట్ల అంతటా ఆశ్చర్యం వ్యక్తమైంది.

అత్యంత అమానుషంగా అత్యాచారం జరిపి ఘోరాతి ఘోరంగా హత్య చేసిన వ్యక్తులను దేశ అత్యున్నత న్యాయస్థానం విడుదల చేయడమేమిటనే ప్రశ్న తలెత్తింది. సుప్రీంకోర్టే ఇటువంటి అన్యాయమైన తీర్పును ప్రకటించిన తర్వాత బాధితులకు దారి దిక్కు ఎక్కడ అని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. 2012లో ఢిల్లీలో దేశమంతటా సంచలనం రేపిన నిర్భయ ఉదంతం జరగడానికి ముందు ఆ ఏడాది ఫిబ్రవరిలో హర్యానాలోని రేవారి జిల్లాలోని పంట పొలాల్లో 19 ఏళ్ళ మహిళ మృత దేహం కనిపించింది. ఆమెను అపహరించి అత్యాచారం చేసి, ఆటో మొబైల్ పరికరాలతో హింసించి కళ్ళల్లో యాసిడ్ పోసి మద్యం సీసాను మర్మావయవంలో దూర్చి దారుణంగా హతమార్చినట్టు విచారణలో తేలింది.

ఇందుకు బాధ్యులైన రవి కుమార్, రాహుల్, వినోద్ అనే వ్యక్తులకు 2014లో ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించగా, ఢిల్లీ దానిని ధ్రువపరిచింది. వారు వీధుల్లో తిరిగే రక్తం రుచి మరిగిన క్రూర మృగాల వంటి వారని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతగా ఉన్నత న్యాయ స్థానం ద్వేషించిన వ్యక్తులకు సుప్రీంకోర్టు స్వేచ్ఛను ప్రసాదించడం నిజంగానే ఆశ్చర్యకరం. అయితే ఇక్కడొక కొట్టి పారేయడానికి వీలు లేని న్యాయ సూక్ష్మం వుంది. ఈ ముగ్గురి నేరాన్ని అణుమాత్రమైనా అనుమానానికి వీల్లేని రీతిలో రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున వారిని విడుదల చేస్తున్నట్టు సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. నిందితుల గుర్తింపు సవ్యంగా జరగలేదని, విచారణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జస్టిస్ లలిత్ ధర్మాసనం అభిప్రాయపడింది.

న్యాయస్థానాలు న్యాయాన్యాయాలను చట్టానికి నూటికి నూరు పాళ్లు కట్టుబడి నిర్ధారించాలని బయటి నుంచి వచ్చే ఎటువంటి నైతిక వత్తిళ్లకూ, ఇతర అంశాలకు లొంగకూడదని పేర్కొన్నది. అంటే ఈ కేసు దర్యాప్తులోనే లోపం జరిగినట్టు సుప్రీంకోర్టు నిర్ధారణకు వచ్చింది. నిందితులు అమానుషమైన నేరానికి పాల్పడ్డారనే జనాభిప్రాయానికి విలువ ఇచ్చి మరణ శిక్ష విధించారే గాని చట్ట ప్రకారం నేర నిర్ధారణ జరగలేదని భావించింది. ఈ కేసులో శిక్ష విధించేటప్పుడు కింది కోర్టు పూర్తి కర్తవ్య స్పృహతో వ్యవహరించలేదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. మొత్తం 49 మంది సాక్షుల్లో 10 మందిని ప్రశ్నించకుండా వదిలేశారన్న స్పష్టమైన లోపాన్ని వేలెత్తి చూపించింది. దర్యాప్తు , విచారణ శాసన బద్ధంగా సాగలేదనే అభిప్రాయానికి వచ్చిన తర్వాత శిక్షను ఖరారు చేయడం తన స్థాయికి తగదని వారి విడుదలకు ఆదేశించి వుండాలి.

ఇది జనం దృష్టిలో అన్యాయంగానే అనిపించవచ్చుగాని చట్టబద్ధత అనే కొలబద్దకు నిలబడని శిక్షలను సుప్రీంకోర్టు ధ్రువపరచాలని ఎవరూ కోరుకోజాలరు. ఘోరమైన నేరానికి పాల్పడిన వారు శిక్ష అనుభవిస్తుండగా విడుదల కావడం బాధాకరమైనప్పటికీ దర్యాప్తుగాని, న్యాయ విచారణ గాని సవ్యంగా జరపకుండా శిక్ష విధించడం అనే దానిని సుప్రీంకోర్టు తప్పు పట్టడం ముందు ముందు అనేక కేసుల్లో కింది కోర్టులకు, దర్యాప్తు చేసే పోలీసులకు గుణపాఠం అవుతుంది. ఆ మేరకు న్యాయానికి అసాధారణమైన మేలు జరుగుతుంది. గతంలో మహారాష్ట్రకు చెందిన ఆరుగురు సంచార జాతులకు చెందిన వ్యక్తులను ఇలాంటి ఒక దారుణమైన హత్యాచార కేసులోనే శిక్ష పడిన తర్వాత సుప్రీంకోర్టు విడుదల చేసింది.

నాసిక్‌లో ఒక బందిపోటు సందర్భంలో ఒక మహిళను, 15 ఏళ్ళ ఆమె కుమార్తెను చెరిచి హత్య చేశారన్న కేసులో ఆరుగురు గిరిజనులకు ఉరి శిక్ష పడింది.16 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత వారు అమాయకులని, అసలు నేరస్థులు కారని భావించిన సుప్రీంకోర్టు వారి విడుదలకు ఆదేశిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. ఐదేసి లక్షలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుత కేసులో ముగ్గురూ ఆ హత్యాచారానికి పాల్పడిన వారేనని రూఢి అవుతున్నప్పటికీ అది న్యాయ విధి విధానాలపరంగా రుజువు కాకపోడం వారి విడుదలకు దారి తీసింది. ఆ రకంగా ఈ కేసులో జరగాల్సిన న్యాయం జరగలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News