సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్థీవాలా
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాలు అర్థసత్యాలతో ఇష్టారాజ్యం సాగిస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జెబి పర్థీవాలా విమర్శించారు. బిజెపి అధికార ప్రతినిధి హోదాలో నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయి వ్యాఖ్యలతో రూలింగ్ వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో పర్థీవాలా కూడా ఉన్నారు. సోషల్ మీడియా అతిగా వ్యవహరిస్తోంది, నియంత్రణ కట్టుదిట్టం కావాల్సి ఉంది. ఏదేని అంశాన్ని ఎంచుకుని ఈ మీడియా సొంతంగా వేటసాగించడం, పలు రకాల వ్యాఖ్యానాలకు దిగడం మంచిది కాదు. ఇటువంటి చర్య చట్ట పాలన, చట్టం విధింపునకు ఆటంకం కల్గిస్తుంది, చట్టపరమైన చర్యలకు ఇది అనారోగ్యకర పరిణామం అవుతుందని తెలిపారు. ఆదివారం ఆయన ఓ సదస్సును ఉద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏదైనా అన్యాయం జరిగినట్లు అయితే దీనిపై ట్రయల్ జరగాల్సింది న్యాయవ్యవస్థ పరిధిలోనే. అయితే మీడియా ట్రయల్స్ జరగడం దారుణం అన్నారు. న్యాయవ్యవస్థ పరిధిలోకి ఇతరుల ప్రవేశం లక్ష్మణరేఖను అతిక్రమించడమే అవుతుందని వ్యాఖ్యానించారు.