వారి ఆదేశాల మేరకే అన్నారం, సుందిళ్ల లొకేషన్లను మార్చాం
కాళేశ్వరం కమిషన్ ముందు రిటైర్డ్ ఈఎన్సీల పొంతన లేని
సమాధానాలు అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ ఘోష్
మన తెలంగాణ / హైదరాబాద్ : గత ప్రభుత్వ ఆదేశాల మేరకే అన్నారం, సుందిళ్ల లొకేషన్లను మార్చినట్లు జస్టిస్ సిపి ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ఎ దుట నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, చీఫ్ ఇంజనీర్లు వెల్లడించారు. విచారణలో భాగంగా గురువారం ఇద్దరు రిటైర్డ్ ఈఎన్సీలు నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ రావు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సిడివో) రిటైర్ చీఫ్ ఇంజనీర్ నరేంద ర్ రెడ్డి, గజ్వేల్ ఈఎన్సీ హరిరాంలు గురువారం కమిషన్ ముందు హాజరయ్యారు. వీరిని ఒకే వరుసలో కూర్చోబెట్టి కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ ‘మీరు నిజాలు చెరిపేయవద్దు, ప్రాజెక్టులకు సంబంధించిన డా క్యుమెంట్లు దాచవద్దు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా రిటైర్డ్ ఈఎన్సీ న ల్ల వెంకటేశ్వర్లను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ, మేడిగడ్డ, అ న్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ ఎందుకు మార్చారని ప్రశ్నించారు.
నల్లా వెం కటేశ్వర్లు సమాధానమిసూ గ్రావిటీ కెనాల్ పొడవు తగ్గించడం, కెపాసిటి పెంచడం, అటవీ భూముల సేకరణ తగ్గించడం, ఎత్తిపోతలు, విద్యుత్ భారం తగ్గించడానికి బ్యారేజిల నిర్మాణ స్థలాలను మార్చాల్సి వచ్చినట్ల్లు ఆయన వివరించారు. వీటిని అప్పటి సిఎం కెసిఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరిశ్ ఆదేశాల మేరకే తాము నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. బ్యారేజిల్లో నీరు నిల్వచేయాలని ఎవరి నిర్ణయమని కమిషన్ ప్రశ్నించగా, అది కూడా వారి నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు. అయితే తనకు చెబుతున్న సమాచారం ఒక విధంగా ఉంది, రికార్డుల్లో మరొకవిధంగా ఉంది వాటిని ఎందుకు దాస్తున్నారంటూ జస్టిస్ ఘోష్ రికార్డులను చూపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిజైన్స్, డిపిఆర్, నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాలపై కూడా కమిషన్ వారిని ప్రశ్నించింది. డిపిఆర్ తయారీని వ్యాప్‌కాన్ సంస్థకు ఆప్పగించాలని ఎవరు చెప్పారని కమిషన్ ప్రశ్నించగా, అది కూడా గత ప్రభుత్వ పెద్దల నిర్ణయమేనని ఆయన సమాధానం ఇచ్చారు. వీటిపై కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో సమాధానం చెప్పలేక నీళ్లు నమలడంతో పాటు మరికొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక మౌనం వహించారు. మూడు బ్యారేజీల నిర్మాణ వ్యయం ఎంత ? అని కమిషన్ ప్రశ్నించగా రూ.9 వేల కోట్లు అని రిటైర్డ్ ఈఎన్సీలు సమాధానం ఇచ్చారు. దీనికి కమిషన్ తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు చూపుతూ మీరు చెప్పింది వాస్తవంకాదు, ఇందులో మరి రూ.13 వేల కోట్లు అని ఉంది కదా అని నిలదీశారు. జీవో నెంబర్ 28పై అడిగిన ప్రశ్నలకు వారు నోరుమెదపలేదు. ప్రజాధనం వృథా అయ్యిందని మీరు భావించడం లేదా అని కమిషన్ ప్రశ్నించగా దానికి కూడా వారు సమాధానం ఇవ్వలేదు.
పెనాల్టీలు వేశారా !
నిర్మాణం ఒప్పందం మేరకు జరగని పనుల్లో జాప్యానాకి సంబంధిత ఏజెన్సీలకు ఎప్పుడైనా పెనాల్టీలు వేసిన సందర్భాలు ఉన్నాయా ? అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా వేయలేదని రిటైర్డ్ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు. మరి మీబాధ్యతలను విస్మరించినట్లు కాదా అని కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజ్‌ల నిర్మాణ సమయంలో సరిగ్గా మానిటర్ చేయలేదని ఒప్పుకుంటారా ? అన్న కమిషన్ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ బ్యారేజ్ నిర్మాణ సమయంలో తాను తరచూ ప్రాజెక్టు వద్దకు వెళ్లేవాడినని ఆయన చెప్పారు.
మురళీధర్‌రావుపై అసహనం
రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావుపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కమిషన్ అడిగిన ప్రశ్నలు వేటికి కూడా ఆయన సమాధానంఇవ్వకుండా తనకు తెలియదు, గుర్తులేదని దాటవేశారు. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ ఆయనపై అసహనం వ్యక్తం చేస్తూ మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారని కమిషన్ సూటిగా ప్రశ్నించారు. తాను 2024, ఫిబ్రవరిలో రిటైర్డ్ అయ్యానని మురళీధర్ రావు చెప్పడంతో తాను ఎప్పుడో ఇచ్చిన తీర్పులు కూడా ఇప్పటికీ తనకు గుర్తుకు ఉన్నాయని చెప్పారు. మీరు మాత్రం అప్పుడే మరిచిపోయారా ? అంటూ జస్టిస్ పిసి ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాను మెమరీ లాస్ అయినట్లు మురళీధర్ రావు సమాధాన మిచ్చారు. మెమరీలాస్ కాకుండా ఉండేందుకు పుస్తకాలు చదవితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని మురళీధర్ రావుకు కమిషన్ హితవుపలికారు.