మన తెలంగాణ/హైదరాబాద్:కాళేశ్వరంప్రాజెక్టు పై చేపడుతున్న న్యాయ విచారణ కొనసాగుతోంద ని జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పరిశీలించామని పేర్కొన్నా రు.బ్యారేజీల ఇంజినీర్ల నుంచి వివరాలు తీసుకున్నామని, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణ కు పిలుస్తామని స్పష్టం చేశారు. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటున్నామని, పూర్తిగా నిర్ధారణకు వచ్చాకే నివేదిక ఇస్తానని వెల్లడించారు. సో మవారం హైదరాబాద్‌లోని బిఆర్‌కె భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసిన ఇంజినీర్లతో ఆ యన సమావేశమయ్యారు. విశ్రాంత ఇంజినీర్ ఇన్ ఛీఫ్ మురళీధర్ రావు కూడా పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వి చారణ కమిషన్ ఛైర్ పర్సన్ జస్టిస్ పిసి ఘోష్ చె ప్పారు. సాంకేతిక అంశాలపై విచారణ తర్వాత ఆర్థిక అంశాలపైదృష్టి సారించనున్నట్లు పేర్కొన్నా రు.
విచారణ ప్రక్రియ కొనసాగుతోందని, మూడు ఆనకట్టలను తాను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. విచారణ ప్రక్రియలో భాగంగా విశ్రాంత ఇఎన్‌సిలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, సిఈ చంద్రశేఖర్, ఎస్‌ఈ బసవరాజు, ఈఈలు యాదగిరి, ఓంకార్ సింగ్ ఇవాళ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై వారి నుంచి వివరాలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వివిధ అంశాలపై ఘోష్ ఆరా తీశారు. డిజైన్లు, నిర్మాణం, నమూనా అధ్యయనాలు, నిర్వహణ, తదితరాల గురించి తెలుసుకున్నారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా పిలుస్తానన్నారు. పూర్తిగా నిర్ధారణకు వచ్చాకే నివేదిక ఇస్తానని తెలిపారు. నెలాఖరులోగా గడువు ముగిసే అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని జస్టిస్ చెప్పారు. ఆనకట్టలను పరిశీలన చేసిన నిపుణుల కమిటీ కూడా నివేదిక ఇస్తుందని వివరించారు. కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో చాల అంశాలు ఉన్నాయని భూసేకరణ, పరిహారం అంశాలను కూడా కొందరు పేర్కొన్నారని వెల్లడించారు. కమిషన్‌కు సంబంధం లేని అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తామని చెప్పారు. విజిలెన్స్ విభాగం అన్ని వివరాలు ఇచ్చిందని, వాటిని కూడా పరిశీలిస్తానని అన్నారు. కమిషన్ పని కాకపోయినా ప్రజల కోసం తగిన రక్షణ చర్యలు, మరమ్మతులు చేయాలని చెప్పానని అందుకు అనుగుణంగా ఇంజినీర్లు, సంస్థలు పనులు చేస్తున్నాయని జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు.