ఘోష్ కమిషన్ ఎదుట
ఎల్ అండ్ టి హైడల్ ప్రాజెక్టు
ఉపాధ్యక్షుడు వెల్లడి
నీటిపారుదలశాఖ రివైజ్డ్ డిజైన్లు
ఇవ్వలేదు నాలుగేళ్లలో తీవ్రత పెరిగి బ్యారేజీ కుంగింది :
ఎల్ అండ్ టి ప్రాజెక్టు డైరెక్టర్
వాంగ్మూలం
మన తెలంగాణ / హైదరాబాద్ ః మేడిగడ్డ బ్యారేజ్‌ను నిర్మించిన ఎల్ అండ్ సంస్థ ప్రతినిధులు ముగ్గురు శుక్రవారం జస్టిస్ పీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజిలో ఏడో బ్లాక్ కుంగడానికి దారితీసిన పరిస్థితులపై ఎల్ అండ్ టి ప్రతినిధులపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. ఈ సందర్భంగా సెకనుకు 6 మీటర్ల వేగం(షూటింగ్ వెలాసిటీ)తో బ్యారేజ్ గేట్ల నుంచి వరద బయటకి దూకి దిగువన నేలను తాకుతుందనే అంచనాలతో సీడీవో విభాగం డిజైన్లను రూపొందించగా, వాస్తవ వేగం సెకనుకు ఏకంగా 16 మీటర్లు ఉందని ఐఐటీ రూర్కీ నిర్వహించిన అధ్యయనంలో తేలిందని ఎల్ అండ్ టీ హైడల్ ప్రాజెక్టు విభాగం ఉపాధ్యక్షుడు ఎస్.సురేష్‌కుమార్ కాళేశ్వరం కమిషన్ ముందు స్పష్టం చేశారు. బ్యారేజ్ డిజైన్లపై సమీక్ష నిర్వహించి లోపాలున్నట్లుగా ఐఐటీ రూర్కీ తేల్చిందని ఆయన తెలిపారు.మేడిగడ్డ బ్యారేజ్‌ను తొలిసారిగా 2019లో నీటితో నింపగా, అదే ఏడాది బ్యారేజ్‌కు భారీ నష్టం జరిగిందని ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంవీ రామకృష్ణా రాజు వెల్లడించారు.
వరదలు తగ్గినాక గేట్లను దించి పరిశీలించగా బ్యారేజ్ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ పూర్తిగా ధ్వంసమైనట్లు గుర్తించి నీటిపారుదల శాఖకు తాము నివేదిక ఇచ్చామన్నారు. బ్యారేజ్‌లో ఉన్న లోపాలు సరిదిద్దేందుకు రివైజ్డ్ డిజైన్లు, డ్రాయింగ్స్‌ను నీటిపారుదల శాఖ తమకు అందించలేపోయిందని వెల్లడించారు. దాంతో సమస్య తీవ్రత పెరిగి 2023 అక్టోబర్ 21న 7వ బ్యారేజ్ కుంగిపోయిందని ఆయన తెలిపారు. నిర్మాణం పూర్తి అయిన తర్వాత బ్యారేజ్‌ను వరుసగా ఐదేండ్ల పాటు పూర్తిస్థాయిలో నీటితో పూర్తిగా నింపి ఉంచడం వల్ల నిబంధనల ప్రకారం వర్షాకాలానికి ముందు, ఆతర్వాత తనిఖీలు నిర్వహించేందుకు అవకాశం కూడా లేకుండాపోయిందని వివరించారు. మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజ్ లకు 2019లో ఒకే తరహా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) డిజైన్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ల్యాబోరేటరీస్(టీఎస్‌ఈఆర్‌ఎల్)తో మళ్లీ మోడల్ స్టడీస్ నిర్వహించాలని క్షేత్ర స్థాయిలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తనపై అధికారులకు లేఖ రాశారు.
మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజ్‌లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు 2020 జూన్‌లో సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్) నిపుణులు, సీడీఓ ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో సందర్శించి పరీక్షించారు. బ్యారేజ్ నుంచి విడుదలయ్యే వరద ప్రవాహ వేగాన్ని(షూటింగ్ వెలాసిటీ) తగ్గించే వేర్వేరు ప్రత్యామ్నాయాలతో టీఎస్‌ఈఆర్‌ఎల్‌తో కలిసి సీడీఓ బృందం మోడల్ స్టడీస్ నిర్వహించింది. బ్యారేజ్ కు రక్షణ కల్పించేందుకు గాను ఎనర్జీ డిస్సిపేషన్ పనులకు సంబంధించిన డిజైన్లను రూపొందించాలని 2020 ఫిబ్రవరిలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ ఆ శాఖ సీడీఓను ఆదేశించారు. టీఎస్‌ఈఆర్‌ఎల్ నిర్వహించిన 2డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజ్ దిగువన తగిన రీతిలో ఎనర్జీ డిస్సిపేషన్ ఏర్పాట్లను చేసేందుకు డిజైన్లను అందించాలని 2021 మార్చిలో ఈఎన్‌సీకి మళ్లీ ఎస్‌ఈ లేఖ రాశారు. రిటైర్డ్ ఈఎన్‌సీలతో కూడిన నిపుణుల కమిటీ 2022 మార్చిలో మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజ్‌ను సందర్శించి షూటింగ్ వెలాసిటీని తగ్గించాల్సిన అవసరముందని తెలిపారని, అయినా రివైజ్డ్ డిజైన్లు అందించకపోవడంతో బ్యారేజ్ కుంగింది అని ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎంవీ రామకృష్ణా రాజు వివరంగా వెల్లడించారు.
దాంతో నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్లు, డ్రాయింగ్స్ సరైనవేనా ? అని పరీక్షించాల్సిన బాధ్యత మీకు లేదా ? అని కమిషన్ ఆయన్ను ప్రశ్నించగా, పీస్ రేటు కాంట్రాక్టు విధానంలో పనులు దక్కించుకున్న తమకు డిజైన్ల తయారీతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఆ డిజైన్లతో బ్యారేజ్ ను నిర్మించగలమా? లేదా? అన్న అంశాన్ని మాత్రం పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. గడువులోగా పూర్తి చేయాలని ఒత్తిడి ఉన్నా నాణ్యతలో రాజీపడలేదన్నారు. బరాజ్ నుంచి తొంబై వరకు కాంక్రీట్ నమూనాలకు విజిలెన్స్ విభాగం సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తే ప్రమాణాలకు మించిన నాణ్యత ఉన్నట్టు తేలిందని ఆయన చెప్పారు.
లోపాలపై ‘ఎల్ అండ్ టీ’ మాజీ ఉద్యోగి లేఖ
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో తప్పులు జరిగినట్టు కమిషన్‌లో అఫిడవిట్ దాఖలు చేసిన ఎల్ అండ్ టీ మాజీ ఉద్యోగి అమర్‌పాల్ సింగ్ వ్యవహారంపై స్పందించేందుకు ఎంవీ రామకృష్ణా రాజు నిరాకరించారు. లోపాలకు సంబంధించి సంస్థ అంతర్గత మెయిల్స్‌ను అమర్‌పాల్ సింగ్ ఆధారాలుగా సమర్పించినట్టు ఈ సందర్భంగా కమిషన్ గుర్తు చేసింది. అనధికారంగా సేకరించిన ఈ లేఖలను సాక్ష్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అమర్‌పాల్ తొలుత ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సంస్థ తరఫున పాల్గొన్నారని ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎంవీ రామకృష్ణా రాజు కమిషన్‌కు తెలిపారు.
ముందే హెచ్చరించిన ఐఐటీ ప్రొఫెసర్
నిపుణుడు, ప్రొఫెసర్ రామరాజు బ్యారేజ్‌ను సందర్శించి 2022 వర్షాకానికి ముందే షూటింగ్ వెలాసిటీని తగ్గించే ఏర్పాట్లను తక్షణమే చేయాలని, లేకుంటే బ్యారేజ్ దెబ్బతింటుందని హెచ్చరించారని ఎల్ అండ్ టీ డీజీఎం రజనీష్ పి.చౌహాన్ తెలిపారు. బ్యారేజ్‌లో లోపాలను సరిదిద్దకపోవడంతో క్రమంగా తీవ్రత పెరిగి బ్యారేజ్ కుంగిందన్నారు. కుంగిపోయిన ఏడో బ్లాక్‌కు మరమ్మతులు సాధ్యం కాదని, పూర్తిగా దానిని తిరిగి నిర్మించక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాణ సమయంలో బ్యారేజ్ డిజైన్లలో లోపం ఉన్నట్లుగా తమకు కనిపించలేదని కమిషన్ అడిగిన ప్రశ్నకు రజనీష్ చౌహాన్ బదులిచ్చారు.