న్యూఢిల్లీ : జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) నూతన ఛైర్మన్‌గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి. రామ సుబ్రమణియన్ నియమితులయ్యారు. సోమవారం ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు.ఎన్‌హెచ్‌ఆర్‌సి ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం జూన్1న ముగిసింది. అప్పటి నుంచి ఛైర్‌పర్సన్ పదవి ఖాళీగా ఉంది. మిశ్రా పదవీ విరమణ తరువాత ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు విజయభారతీ తాత్కాలికంగా ఆ స్థానంలో కొనసాగారు.
తాజాగా పూర్తి ఛైర్మన్‌గా జస్టిస్ వి. రామ సుబ్రమణియన్ బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా మానవహక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తులు లేదా ఇతర రిటైర్ జడ్జీలను నియమిస్తారు. ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు ఛైర్మన్‌కు రాష్ట్రపతి బాధ్యతలు అప్పగిస్తారు. గతంలో మాజీ సీజేఐలు హెచ్‌ఎల్ దత్తు , కేజీ బాలక్రిష్ణన్ కూడా హెచ్‌ఆర్‌సి పదవిలో ఉన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి ఎక్స్‌పోస్టులో సభ్యులుగా శ్రీప్రియాంక్ కనూంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి(రిటైర్డ్) నియామకమైనట్టు తెలియజేసింది. కనూంగో ఇదివరకు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సిపిసిఆర్)చైర్‌పర్సన్‌గా పనిచేశారు. కమిషన్ సభ్యునిగా తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని ఆయన సోమవారం వెల్లడించారు.
ఇదివరకటి ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా మాజీ సుప్రీం కోర్టు జడ్జి కాగా, సీజేఐ కాకుండా ఎన్‌హెచ్‌ఆర్‌సి చీఫ్‌గా పదవి పొందిన ఘనట ఆయనదే. 2019 మానవ హక్కుల చట్టం సవరణ అయిన దగ్గర నుంచి ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సీ చీఫ్‌గా నియామకమైన వి. రామసుబ్రమణియన్ 2019లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జన్మించిన రామసుబ్రమణియన్ 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి 23 సంవత్సరాల పాటు చెన్నైహైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 2019 సెప్టెంబరు నుంచి 2023 జూన్ 30 వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.