జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం 51వ ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖ వ్యక్తులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి భవన్‌లో కొద్ది సేపు నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవంలో జస్టిస్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సిజెఐ భగవంతుని పేరిట ఆంగ్లంలో ప్రమాణం స్వీకరించారు. 1960 మే 14న జన్మించిన జస్టిస్ ఖన్నా సిజెఐ పదవిలో ఆరు నెలలకు పైగా ఉంటారు. ఆయన 65వ ఏట 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు. ఆదివారం పదవీ విరమణ చేసిన సిజెఐ డివై చంద్రచూడ్ స్థానంలో జస్టిస్ ఖన్నా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ‘భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ఆయనకు హయాంకు నా శుభాకాంక్షలు’ అని ప్రధాని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా సిజెఐ ఖన్నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. విస్తృత పరిశీలన, ఆకాంక్షల కారణంగా ఆయన తన భుజాలపై ఎంతో భారం మోయవలసి ఉంటుందని ఖర్గే పేర్కొన్నారు. ‘51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నాక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత ప్రధాన న్యాయమూర్తి పదవి దానితో వచ్చే విస్తృత పరిశీలన, ఆకాంక్షల కారణంగా ఆయన భుజస్కందాలపై అత్యంత భారం పడుతుంది’ అని ఖర్గే ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నాను. ‘సుదీర్ఘ, విశిష్ట అనుభవం ఉన్నందున ఆయన బాధ్యత భారాన్ని మోయగలరని, న్యాయవ్యవస్థకు ఘనమైన సేవలు అందించగలరని నా నమ్మకం’ అని ఖర్గే తెలిపారు. ప్రధాని మోడీ, మాజీ సిజెఐ చంద్రచూడ్‌తో పాటు ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మాజీ సిజెఐ జెఎస్ ఖేహార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు.
సిజెఐగా సోమవారం మధ్యాహ్నం సర్వోన్నత న్యాయస్థానంలో కోర్టు కార్యకలాపాలు ప్రారంభించిన జస్టిస్ ఖన్నా తనకు శుభాకాంక్షలు చెప్పిన న్యాయవాదులకు ధన్యవాదాలు తెలియజేశారు. జస్టిస్ సంజయ్ కుమార్‌తో కలసి ధర్మాసనంలో ఆసీనుడైన జస్టిస్ ఖన్నా ‘ధన్యవాదాలు’ అని అన్నారు. కోర్టు కార్యకలాపాలు మొదలు కావడానికి ముందు సీనియర్ న్యాయవాది, మాజీ అద్వొకేట్ జనరల్ ముకుల్ రోహత్గి మాట్లాడుతూ, ‘సిజెఐగా మీ హయాం ఫలప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని చెప్పారు, ఇతర న్యాయవాదులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.