సిఎస్‌కు బిఆర్‌ఎస్ వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కులగణనలో అశాస్త్రీయ పద్ధతులు అవలంభించిందని బిఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది. బిసిలకు అన్యాయం చేసేలా ఉన్న కులగణనను వెంటనే సరిచేయాలని బిఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కోరింది. ఈ మేరకు శనివారం సచివాలయంలో సిఎస్‌ను బిఆర్‌ఎస్, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల బృందం వినతిపత్రం సమర్పించింది. అనంతరం సచివాలయం మీడియా సెంటర్ వద్ద బిఆర్‌ఎస్ నేతలు మధుసూధనా చారి, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపరిచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
కులగణనలో బిసిల సంఖ్యను తగ్గించి చూపించిన కుట్రను సరిచేయాలని డిమాండ్ చేస్తూ సిఎస్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. రిజర్వేషన్ల అంశంలో బిసిలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసేందుకే ఏడాది పాటు కులగణన కార్యాచరణ చేపట్టకుండా కాలయాపన చేసిందన్నారు. తీరా హడావుడిగా న్యాయస్థానాల తీర్పులకు విరుద్ధంగా ప్లానింగ్ విభాగం ద్వారా ఆశాస్త్రీయంగా విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, కుటుంబ, కులగణన సర్వేను చేపట్టిందని ఆరోపించారు. ఈ సర్వేలో 2011 కేంద్ర గణాంకాలు, 2014 సమగ్ర కుటుంబ సర్వేలతో పోల్చితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సర్వేల్లో బిసి కులాల జనాభా సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిందని ఆరోపించారు. ఇదేలా జరిగిందని ప్రశ్నించారు. బిసిల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని పొరపాట్లను సరిదిద్దాలని కోరారు.
బిసి రిజర్వేషన్‌ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. మే మెంతో మా క ంత వాటా ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్‌లకు చట్టబద్దత కల్పించాలని కోరారు. బిఆర్‌ఎస్ బిసిల పక్షా నిలబడుతుందని, అన్యాయంపై పోరాడుతుందని హెచ్చరించారు. కులగణన సర్వే ద్వారా బిసి జనాభా 7 నుండి 8 శాతం తగ్గిందన్నారు. ఒక రోజు డెడికేషన్ డేగా పెట్టుకొని రీ సర్వే చేయాలని బిఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిసిలకు రాజ్యాధికారం కావాలన్నారు. సకలజనుల సర్వేలో బిసిలు 52 శాతం ఉన్నట్లు తేలిందని దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సమగ్ర సర్వే సేరుతో కాకి లెక్కలు చూయించి బిసిల సంఖ్యను తగ్గించి చూపుతున్నారన్నారు. 52 శాతం ఉన్న బిసిలు 46 శాతానికి ఎలా తగ్గుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం చూసినా మంత్రివర్గంలో బిసిలకు ప్రాతినిధ్యమేదని ప్రశ్నించారు. కేవలం ఇద్దరు మంత్రులను తీసుకొని బిసిలకు అన్యాయం చేశారని విమర్శించారు. రిసర్వే చేసి బిసిల సంఖ్యను సరిచేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిఆర్‌ఎస్ ఊరుకోదని హెచ్చరించారు.