Thursday, January 16, 2025

దారిచూపని జువెనైల్ హోమ్స్

- Advertisement -
- Advertisement -

గరికపచ్చ మైదానాల్లో సీతాకోకచిలుకల్లా విహరించాల్సిన చిన్నారులు.. శారీరక, మానసిక ఆరోగ్యానికి బాటలుపరిచే ఆటపాటలకు దూరమవుతున్నారు. కలుపుగోలుతనాన్ని పెంచుకోవాల్సిందిపోయి ఒంటరితనంతో మగ్గిపోతున్నారు. ఈక్రమంలో కట్టుతప్పి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పేదరికం, విద్యావకాశాల లేమి తదితరాలతో తెలిసీతెలియనితనంతో నేరాలబాట పడుతున్న పిల్లల సంఖ్య పెరిగిపోతోంది. పిల్లలైనప్పటికీ హేయమైన నేరాలకు పాల్పడినప్పుడు తగిన శిక్ష విధించాలని సర్వోన్నత న్యాయస్ధానం అభిప్రాయపడింది.ఈ నేపథ్యంలో 16 18 ఏళ్లలోపు నిందితులు మైనర్లయినా మేజర్లుగానే పరిగణించాలని 2015 జువెనైల్ జస్టిస్ చట్టంలో ప్రతిపాదించారు. నేరాల స్వభావం, మైనర్లను మేజర్లుగానే భావించాలా లేదా అన్నది జువెనైల్ జస్టిస్‌బోర్డు నిర్ణయిస్తుంది.మన దేశంలో 1850 నుంచి బాలల కోసం నిర్దేశించిన చట్టాలు అమలులో ఉన్నాయి. నేరం జరిగే నాటికి నిందితుడికి 18 ఏళ్లలోపు వయసు ఉంటే జువెనైల్ చట్టం ప్రకారం మూడేళ్లకు మించి శిక్షవిధించే అవకాశంలేదు. దేశ వ్యాప్తంగా 18 ఏళ్లలోపు బాలలు సుమారు 47 కోట్ల మంది ఉన్నారు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సిఆర్‌బి) లెక్కల ప్రకారం 2020లో 35,352 మంది బాలలను వివిధ నేరాల కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 981 మందిపై హత్యాభియోగాలు నమోదయ్యాయి. శాంతిభద్రతలకు విఘాతం, అసాంఘిక కార్యకలాపాలు, ఇతర నేరాల కింద మైనర్లపై దాదాపు 400 కేసులు దాఖలయ్యాయి. 1,668 పోక్సో కేసుల్లో 1,885 మంది మైనర్లు నిందితులుగా నమోదయ్యారు. అత్యాచారం కేసుల్లో 1,383 మంది, మహిళల గౌరవానికి భంగకరమైన చర్యల కింద 1,154 మంది బాలలపై అభియోగాలు నమోదయ్యాయి. హత్యలు, అత్యాచారాలు, మహిళల గౌరవానికి భంగం కలిగించడం వంటి నేరాలకు సంబంధించి మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో బాలలపై అధికంగా కేసులు నమోదయ్యాయి. నేరారోపణ ఎదుర్కొంటున్న ప్రతి బాలుడు ‘బాలనేరస్థుల పరిరక్షణ చట్టం’ ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు(జెజె) ముందు విచారణ ఎదుర్కోవలసి ఉంటుంది. నేరం చేసిన తేదీ నాటి వయసు ప్రామాణికం అవుతుంది. అరెస్టు చేసిన రోజునుంచి తుది తీర్పు వరకు జెజె బోర్డు విచారిస్తుంది. ఈ బోర్డులో మొదటి శ్రేణి జ్యుడిషియల్ న్యాయాధికారి, రాష్ర్ట ప్రభుత్వం నియమింపబడిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యుల్లో ఒకరు మహిళ, మరొకరు చైల్డ్‌సైకాలజిస్ట్ ఉంటారు. విచారణ, తీర్పు, బెయిలుపై విడుదలయ్యే వరకూ బాలుడు ప్రభుత్వ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలోని అబ్జర్వేషన్ హోమ్స్ లో ఉంచుతారు. నేరం రుజువైతే నిందితుడిని కారాగార శిక్ష బదులుగా జెజె బోర్డు సభ్యులు మందలించి విడుదల చేయడం లేదా మూడేళ్లపాటు సంస్కరణ గృహం(జువెనైల్ హోం)లో ఉంచుతారు. ఈ హోంలో చేరిన పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకొంటారు. వృత్తి విద్య, కౌన్సిలింగ్ వంటివి చేపడుతారు. కానీ, జువెనైల్ హోంలు జైళ్ల వాతావరణాన్ని తలపిస్తుండటంతో పిల్లలు ఇబ్బందిపడుతున్నారు. ఇరుకు గదుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, చదువు, ఆటపాటలు, ఆహారం విషయంలో సిబ్బంది శ్రద్ధ చూపడం లేదని ఆరోపణలున్నాయి. అందుకే పిల్లలు జువెనైల్ హోం నుంచి తప్పించుకుపోతున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే వరుస సంఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలల్లో ముగియాల్సిన నేర విచారణ నెలల తరబడి కొనసాగుతుండటం, బెయిల్ వచ్చినా జామీనుఇచ్చేవారు లేకపోవడం తదితర కారణాలతో చాలా మంది పిల్లలు నెలల తరబడి హోవ్‌ులో మగ్గుతున్నారు. బయటకు వెళ్లాలన్న తీవ్రమైన కోరికతో హోవ్‌ులో ఉండలేక బాలురు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికితోడు సిబ్బంది నిఘా వైఫల్యం కూడా తోడవుతోంది. హత్య, అత్యాచారం, దోపిడీ వంటి నేరాలకు పాల్పడుతున్న బాలల సంఖ్య పెరిగిపోతున్న దృష్ట్యా జెజె చట్టానికి సవరణలు తేవాలని సర్వోన్నత న్యాయస్థానం 2011లోనే అటార్నీ జనరల్‌ను కోరింది. నేరస్థుడిది పిన్నవయసు కాబట్టి తాను చేసిన పని ఎక్కడికి దారితీస్తుందో తెలియదనుకోవాలా, మనసు ఎదగలేదు కనుక అతడు చేసింది నేరం కాదని నిర్ధారించవచ్చునా, బాలనేరస్థుడి దృష్టిలో హతుడి ప్రాణాలకు విలువ లేదా అని ఓ హత్యకేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2012 డిసెంబరులో ఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటన జరిగాక జెజె చట్టాన్ని సవరించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. హత్యలు, అత్యాచారాల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే 1618 ఏళ్ల బాలలను పెద్దవారితో సమానంగా పరిగణించి శిక్షించాలన్న వాదన గట్టిగా వినిపించింది. భారతీయ బాల న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించాల్సిన జువెనైల్ కేంద్రాలు గాడి తప్పుతున్నాయి. దేశవ్యాప్తంగా 817 జువెనైల్ హోవ్‌‌సు ఉండగా, తెలంగాణలో తొమ్మిదున్నాయి. వీటిలో చాలా వరకు బాల ఖైదీలతో కిక్కిరిసి వున్నాయి. జాతీయ నేరగణాంక సంస్థ లెక్కల ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 31,000 మంది బాలనేరస్తులుగా నమోదయ్యారు. వీరి సంఖ్య ఏటా 5% పెరుగుతున్నది. బాలనేరస్థులకు కనీస రక్షణ, భద్రతను జువెనైల్ హోవ్‌‌సులో కల్పించాలి. కానీ అధిక సంఖ్యలో ఉండటంతో పిల్లవాడికి వ్యక్తిగతమైన సంరక్షణ, శిక్షణ, పోషణ సాధ్యపడటం లేదు. పారిశుద్ధ్య సౌకర్యాలు, మానసిక ఉల్లాసంకోసం వినోదం, నాణ్యమైన విద్యా వనరులు కరువయ్యాయి. కొన్నిచోట్ల స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్ వంటివి లేవు. పిల్లల బాగోగులు చూసుకొని సంస్కరించాల్సిన సిబ్బందే వారిని మానసికంగా, శారీరకంగా వేధించిన సంఘటనలు అనేకం బయట పడుతున్నాయి. దీంతో చాలా మంది పిల్లలు ఇక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లోని జువెనైల్ హోం నుంచి పారిపోయిన ఘటనలు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రతి జువెనైల్ హోం చట్టం నిర్దేశించిన ప్రమాణాలు, మార్గదర్శకాలకు కట్టుబడి పనిచేసేలా స్వతంత్ర సంస్థలతో నిరంతరం తనిఖీలు చేయించాలి. స్వచ్ఛంద, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో బాలల సంస్కరణ కేంద్రాలకు అవసరమైన వనరులను అందించాలి. మెరుగైన వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పించి, వారికి అవసరమైన నైపుణ్యాలను అందించి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఇవి పనిచేయాలి.

కోడం పవన్‌కుమార్
98489 92825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News