ఇప్పటి వరకు పని చేసిన ఎస్. కృష్ణ ఆదిత్యకు ఘనంగా వీడ్కోలు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా డాక్టర్ జ్యోతి బుద్దప్రసాద్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. సనత్‌నగర్‌లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఈ మేరకు ఆయన బాద్యతలను స్వీకరించిన అనంతరం అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాలుష్య నియంత్రణకు కృషి చేయాలని ఆదేశించారు. పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసి సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణ సమతుల్యంగా ఉండాలని, స్థిరమైన అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని అన్నారు. సాంకేతికత బదిలీని ఉపయోగించి పారిశ్రామిక ఉత్పత్తి, పర్యావరణ సమతుల్యత కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పని చేసి తెలంగాణ కార్మిక శాఖకు బదిలీ అయి వెళ్లిన సభ్య కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్యను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పిసిబి చీఫ్‌గా ఆయన పని చేసిన సమయంలో పిసిబి అధికారులు, సిబ్బంది తమ అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.