Saturday, December 21, 2024

జ్యోతిబా ఫూలే ఆశయాలను సాధించాలి

- Advertisement -
- Advertisement -

ఫూలేకు ఘన నివాళులు అర్పించిన బిసి సంక్షేమ శాఖ

Jyotiba phule birth anniversary
మనతెలంగాణ/ హైదరాబాద్ : విద్యను ఆయుధంగా చేసుకుని అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన దార్శనికుడు మహాత్మా జ్యోతిబా పూలే అని రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ కొనియాడారు. సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే 196వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారు అధ్యక్షత వహించగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విశిష్ట అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ బహుజనుల, వెనుకబడిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిబా పూలే చేసిన సేవల్ని గుర్తుంచుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. బిసి ఐక్యత కోసం ఫూలే తన జీవితాన్ని ధారపోశారని ఆర్ కృష్ణయ్య అన్నారు. అధిపత్య కులాలపైఆయన చేసిన పోరాటం స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలతో పాటు నిబద్దత అలవరుచుకోవాలని కోరారు. బిసిలు సంఘటితమై అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వచ్చేలా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై కృష్ణయ్య మండిపడ్డారు. బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం మాట్లాడుతూ పూలే జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆ మహనీయుడి పేరిట బిసి గురుకులాలు, విదేశీ విద్యానిధి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా బిసి స్టడీ సర్కిల్స్ ద్వారా ఉచిత కోచింగ్ అందిస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ నెల 16న నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షకు బిసి విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని ట్యాంక్‌బండ్‌పై మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిభాయి పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలని , పూలే జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని, పాఠ్య పుస్తకాలలో పూలే చరిత్రని పాఠ్యాంశంగా పెట్టాలని పలువురు వక్తలు కోరారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరి గౌరీశంకర్, బిసి కమిషన్ సభ్యుడు ఉపేంద్ర, బిసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు, బిసి ఫెడరేషన్ చైర్మన్లు చంద్రశేఖర్, బాలాచారి, ఉదయ్‌కుమార్, విమల, పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్లు ఆనంద్ కుమార్, నీలా వెంకటేష్, రాజేందర్, బడేసాబ్, దూదేకుల సంఘం జాతీయ ఇన్‌చార్జీ షేక్ షకీనా, బిసి సంక్షేమశాఖ అధికారులు, బిసి సంఘాల నాయకులు, పెద్ద సంఖ్య విద్యార్థులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News