Wednesday, January 22, 2025

ఫూలే సంస్కరణోద్యమ సంఘం

- Advertisement -
- Advertisement -

బ్రాహ్మణత్వ తాత్వికత, ప్రయోజనాలను కాపాడడానికి బ్రాహ్మ ణ నాయకులు 1870 లలో ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, ప్రార్థనా సమాజ్‌లను స్థాపించారు. జోతిబా ఫూలే 24 సెప్టెంబర్ 1873 న సత్యశోధక సమాజ్‌ను స్థాపించారు. సంత్ కబీర్ ఆలోచనలతోఆయన పొందిన స్ఫూర్తి సత్యశోధక సమాజ్ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించింది. క్రైస్తవ ప్రొటెస్టాంట్ భావాల ప్రభావంలో సాగిన జోతిబా విద్య సత్యశోధక సమాజ్ సైద్ధాంతిక పునాదులపై ప్రభావం చూపింది. సత్యశోధక సమాజ్ ఉద్యమం మత చట్రంలో సాగింది. దైవ నమ్మకాన్ని ఆమోదించింది. సృష్టికర్త ఇచ్చిన సమానత్వాన్ని నొక్కి చెప్పింది. దేవునికి, మనిషికి మధ్య మధ్యవర్తిని, విగ్రహారాధన, కుల వ్యవస్థలను వ్యతిరేకించింది. మతాచారాల్లో బ్రాహ్మణ పూజారి అవసరాన్ని ప్రశ్నించింది. బ్రాహ్మణత్వ సామాజిక, రాజకీయ ఆధిపత్యంపై చర్చించింది.

సత్యశోధక సమాజ్ సూత్రాలు: 1. సహజ లక్షణాలతోనే మానవులు గొప్పవారు 2. మంత్రాలు, తపస్సు, పశ్చాత్తాపం, కర్మకాండలు, ఆచారాలు వాస్తవ జీవిత విరుద్ధాలు 3. దైవ పూజకు బ్రాహ్మణుల, మధ్యవర్తుల అవసరం లేదు. సమానత్వం, సహోదరత్వం సమాజ్ ఆశయాలు. ‘బ్రాహ్మణాధిక్యత స్వాభావిక లక్షణం కాదు. బ్రాహ్మణ సామాజిక స్థాయిని రక్షించుకొని, స్థిరపర్చుకునే పన్నాగమే కుల వ్యవస్థ. తక్కువ కులాలుగా నీచంగా చూడబడ్డవారు బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించాలి’ అని సత్యశోధక సమాజ్ ప్రచారం చేసింది. బ్రాహ్మణ సంప్రదాయ- వ్యతిరేక సామాజిక మార్పు సూచించింది. తక్కువ ఖర్చు పెళ్ళిళ్ళు, కుల మతాంతర, వితంతు వివాహాల హక్కు, బాల్య వివాహాల రద్దు ఆ సూచనల్లో కొన్ని. 25 డిసెంబర్ 1873 న కట్న కానుకలు, బ్రాహ్మణ పూజారి, పెళ్లి మంత్రాలు, సంస్కృత శ్లోకాలు లేని మొదటి సత్యశోధక వివాహం జరిపారు.

ఈ పెళ్ళిలో బాలికలకు చదువు చెపుతానని, స్త్రీ సమానత్వానికి పాటు పడతానని పెళ్లి కూతురు ప్రమాణం చేయాలి. వాగ్దానాల రూపంలోని పెళ్లి మంత్రాలను వధూవరులే చదవాలి. బాంబే హైకోర్టు ఈ వివాహ పద్ధతిని గుర్తించింది. ఫూలే దంపతుల పెంపుడు కొడుకు యశ్వంత్ కూడా కులాంతర సత్యశోధక వివాహం చేసుకున్నారు. నిజ నిర్ధారణ కోరుకునేవాళ్ళ ఈ సంఘం అణగారినవారి చైతన్య సేవా సమితిగా పని చేసింది. స్త్రీలు, శూద్రులు, దళితులకు విద్య, సామాజిక హక్కులు నేర్పింది. రాజకీయ రంగప్రవేశం కల్పించింది. జోతిబా సతీమణి సావిత్రిబాయి సమాజ్ మహిళా విభాగ బాధ్యత నిర్వహించారు. ఈ సమాజం అన్ని కుల మతాల, వృత్తుల వారిని ఆకర్షించింది. బ్రాహ్మణులు, ముస్లింలు, అంటరానివారు, రాజపుత్రులు, న్యాయవాదులు, వ్యాపారులు, భూస్వాములు, వ్యవసాయ కూలీలు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు సమాజ్‌లో చేరారు. అగ్రవర్ణ దోపిడీకి వ్యతిరేకంగా తక్కువ కులస్థులను చైతన్యపర్చారు.

జోతిబా తర్వాత సత్యశోధక సమాజ్ నిర్వహణలో సావిత్రిబాయి ప్రధాన పాత్ర పోషించారు, ముందుకు నడిపారు. 1893లో సాస్వాడ్ లో జరిగిన సమాజ్ వార్షిక సభకు అధ్యక్షత వహించారు. ఆ రోజుల్లో సభలకు స్త్రీ అధ్యక్షత వహించడమే విప్లవం. ఈ సభ లక్ష్యం శూద్రుల, అంటరానివారి దోపిడీ, అణచివేతలను అరికట్టడం. తక్కువ కులాల ప్రయోజనాలు సాధించేందుకు సత్యశోధక సమాజ్ వలసవాద ప్రభుత్వంతో సత్సంబంధాలు నిర్వహించింది. బ్రాహ్మణులు, హిందు జాతీయవాదులు, ఈ విధానాన్ని తప్పుబట్టారు. ఉదారత్వం కోల్పోయిన బ్రిటిష్ ప్రభుత్వం, తప్పుదారిబట్టి, ప్రజా సంక్షేమం మర్చింది. ఫిర్యాదులతో సమస్యలను పరిష్కరించుకొని, శూద్రులు తమ స్వేచ్ఛా పరిధిని పెంచుకోడమే ఈ ఎత్తుగడ లక్ష్యమని ఫూలే వీరికి జవాబు చెప్పారు. తమాషా (ఆట పాటల పద్ధతి), జానపద నాటకాలతో సమాజ్ సభ్యులు బ్రాహ్మణ విమర్శలను తిప్పికొట్టారు.

రైతులతో సంబంధాలు పెంచుకున్నారు. సంప్రదాయ వినాయకున్ని ఆహ్వానించారు. గణపతి ప్రజల నాయకుడని వివరించారు.ఈ కళారూపాలు బ్రాహ్మణత్వ నియంతృత్వం, రైతాంగ దోపిడీలను బయటపెట్టాయి. ఈ చైతన్యంతో 1919లో సతారాలో కౌలు రైతులు బ్రాహ్మణ భూస్వాములకు తిరగబడ్డారు. సత్యశోధక సమాజ్ పలు రకాల బ్రాహ్మణ బానిసత్వాల నుండి ప్రజలను విముక్తి చేసిందని ‘విజయీ మరాఠా’ వార్తా పత్రిక వివరించింది. రైతులు మత వేడుకలకు బ్రాహ్మణులపై ఆధారపడడం మానేశారు. దేవాలయ ఉత్సవాలను బహిష్కరించారు. విగ్రహాలను పగులకొట్టారు. పేద, తక్కువ కులాల రైతులు బ్రాహ్మణ దోపిడీ మత గ్రంథాల్లోనే ఉందని నమ్మారు. తమ జీవితాలు బాగుపడాలంటే బ్రాహ్మణ పెత్తనం పోవాలన్నారు. క్రైస్తవులతో సామరస్యత పాటించారు. బ్రాహ్మణులు స్వీయ రక్షణలో పడ్డారు.

ఫూలే తర్వాత బ్రాహ్మణత్వ వ్యతిరేక ఉద్యమం కొనసాగింది. 1890లో ‘అనార్యుల సమస్యల పరిష్కార మండలి’ ఏర్పాటయింది. 1892లో సైన్యంలో అంటరాని కులాలవారి ప్రవేశం నిషేధించబడింది. జోతిబా ఆదర్శాలతో ప్రభావితులైన దళిత నాయకులు ఈ బహిష్కరణను సవాలు చేశారు. ఈ కార్యక్రమాలు ఆంబేడ్కర్ నాయకత్వంలో దళిత ఉద్యమాలకు పునాది వేశాయి. ‘బహిష్కృత హితకారిణి సభ’, ‘ప్రజా విద్యా సమాజం’ వగైరా సంఘాల సహకారంతో అంబేడ్కర్ అంటరాని కులాల, అణగదొక్కబడిన తరగతుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం పోరాడారు. ఇండియన్ లేబర్ పార్టీ, షెడ్యూల్డ్ కులాల సమాఖ్య, భారత రిపబ్లికన్ పార్టీ వంటి రాజకీయ పార్టీల నిర్మాణానికి ఈ సంఘాలు, ఉద్యమాలు రూపకల్పన చేశాయి.

1920 నాటికి సత్యశోధక సమాజ్ మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో బలంగా స్థిరపడింది. బహుజన సమాజ్ శైలిలో ప్రాతినిధ్యం సాధించింది. వ్యాపారులు, బ్రాహ్మణ వడ్డీ వ్యాపారులు, సామాన్య ప్రజల దోపిడీదార్లని చెప్పింది. శూద్రులైన మారాఠాలు తమను క్షత్రియులుగా పరిగణించుకున్నారు. కాని అతి శూద్రులను తమతో కలుపుకోలేదు. బ్రాహ్మణత్వ వ్యతిరేక ఉద్యమంలో అతిశూద్రులు మాత్రమే మిగిలారు.

సత్యశోధక సమాజ్ సభ్యత్వ నమోదుకు ఏడాదికి నాలుగణాల చందా నిర్ణయించారు. జోతిబా లెక్కలు చూసేవారు. ప్రతి ఆదివారం రాత్రి భావు మానసరాం భావరే నాయక్ ఇంట్లో సమాజ్ వారాంత సమావేశాలు జరిగేవి. సెప్టెంబర్ 24 న వార్షిక వేడుకలు నిర్వహించేవారు. కొత్త సభ్యులు సమాజ్ సూత్రాలు పాటిస్తామని ఖండోబా గంట (తాలి -ఖండోబా పూజాచారం) మోగించి ప్రమాణం చేయాలి. తర్వాత గంట కొట్టే (తాలి) అలవాటు మానేశారు. జోతిబా సన్నిహిత సహచరుల్లో ఒకరైన కృష్ణారావు భాలేకర్ సంపాదకత్వంలో 1879 లో సత్యశోధక సమాజ్ అనుబంధ వార పత్రిక ‘దీనబంధు’ ప్రారంభించారు. సంప్రదాయ జాతీయవాదుల బలమైన ప్రతినిధి విష్ణుశాస్త్రి చిప్లుంకర్, జోతిబా రచనలను ద్వేషించేవారు. దీనబంధు జోతిబాను సమర్థిస్తూ ఘాటుగా స్పందించేది. తర్వాత జోతిబా మరొక సహచరుడు భారత కార్మిక సంఘ ఉద్యమ పితామహుడు నారాయణ మేఘాజి లోఖండే 1880 నుండి దీనబంధును బాంబే నుండి దినపత్రికగా ప్రచురించారు. దీనబంధు జోతిబా సిద్ధాంతాల ప్రచారంలో, విరోధుల నిరోధంలో ప్రముఖ పాత్ర పోషించింది.

సత్యశోధక సమాజ్ నాయకులు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌లో చేరడంతో 1930 లో సత్యశోధక సమాజ్ రద్దయింది. బ్రాహ్మణేతర, దళిత రాజకీయ విషయాలపై మేధావుల్లో, రాజకీయుల్లో సత్యశోధక సమాజ్ సిద్ధాంతం తీవ్ర ప్రభావాన్ని మిగిల్చింది. బ్రాహ్మణుడు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడు నథూరాం వినాయక్ గాడ్సే 1948 జనవరి 30న మహాత్మా గాంధీని హత్య చేశాడు. విస్తృత స్థాయిలో బ్రాహ్మణ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇవి సత్యశోధక సమాజ్ సిద్ధాంతాల ప్రభావమే.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News