గౌతమ బుద్ధుడు తరువాత భారత దేశంలో జ్యోతిభా ఫూలే, డా. బిఆర్ అంబేడ్కర్ వంటి మహనీయులు సమన్యాయం కోసం పోరాడారు. గాంధీజీ కంటే ముందే మహాత్మగా పిలువబడ్డ జ్యోతిభా ఫూలే, అంబేడ్కర్ వంటి మహనీయునికి స్ఫూర్తిగా నిలవడం విశేషం. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతి రావ్ గోవిందరావ్ ఫూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827, ఏప్రిల్ 11న జన్మించారు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవారు. కాలక్రమేణా పీష్వా పరిపాలనా కాలంలో పూల వ్యాపారం చేయడంతో వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందింది. ఏడాది వయస్సులోనే జ్యోతిరావు తల్లి తనువు చాలించింది.
ఏడు సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయం గా ఉండేవారు. కొద్దికాలం మాత్రమే పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరిగింది. ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్ళి చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులుగా మిగిలేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించారు. 1864లో ‘బాలహత్య ప్రతిబంధక్ గృహ’ స్థాపించి, వితంతువులైన స్త్రీలకు, గర్భిణీలకు అండగా నిలిచారు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నారు.
1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించారు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణోద్యమం. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్ మండేలా భారత దేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించుకొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘గులాంగిరి’.
సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతి కోసం చేసిన కృషికి ఫూలేకు ఆనాటి సంఘ సంస్కర్త విఠల్ రావు కృష్ణాజీ వందేకర్ ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు. అంటరానితనం, వితంతు వివాహాల నిషేధం వంటి సాంఘిక అసమానతలను రూపుమాపిన జనోద్ధారకుడు ఫూలే. నిరంతరం సమ సమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే కొంత కాలం దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ 1890, నవంబరు 28న కన్నుమూశారు. ఫూలే తన సతీమణి దేశంలో తొలి ఉపాధ్యాయురాలైన సావిత్రి బాయి పూలేతో కలిసి పలు సాంఘిక ఉద్యమాలు చేశారు.
గుమ్మడి లక్ష్మీనారాయణ
9491318409