కోల్‌కతాలో పోస్టు గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటన దరిమిలా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేపిస్టులకు వృషణాలు తొలగించడమే సరైన శిక్షని జనతాదళ్(యునైటెడ్) సీనియర్ నాయకుడు కెసి త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక రేప్ కేసులలో నెలరోజుల్లోపలే బాధితులకు సత్వర న్యాయం లభించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. బుధవారం పిటిఐ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి కఠినాతి కఠినమైన శిక్షలు పడాలని, వారి వృషణాలను తొలగించడమే అటువంటి నేరాలకు సరైన శిక్షని అన్నారు. కోల్‌కతాలో ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటన, తదనంతరం దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనల గురించి ప్రశ్నిచంగా అత్చాచారానికి పాల్పడినట్లు రుజువైన నేరస్థులకు కఠినమైన శిక్షలు ఉండాలని, చనిపోయేంతవరకు తాను చేసిన నేరానికి ఆ వ్యక్తి బాధను అనుభవించాలని త్యాగి చెప్పారు.
ఈ విధమైన శిక్షలు పడితేనే మరొకఅటువంటి తప్పులు చేయరని ఆయన అభిప్రాయపడ్డారు. మీ డిమాండు వివాదాస్పదం కాదా అని ప్రశ్నించగా తాను మహిళా పక్షపాతినని ఆయన తన వాదనను మసర్థించుకున్నారు. అత్యాచార కేసులలో ఏళ్ల తరబడి విచారణ జరగకూడదని, నెలరోజుల్లోపలే తీర్పు రావాలని ఆయన అన్నారు. ఇటువంటి కేసు దర్యాప్తులో మహిళా పోలీసులు, మహిళా డాక్టర్లు, మహిళా న్యాయమూర్తులే భభాగస్వాములు కావాలని ఆయన సూచించారు. కోల్‌కతా ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఖరిని దురదృష్టకరంగా అభివర్ణించిన త్యాగి గత మంగళవారం బెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన అత్యాచార నిరోధక బిల్లుకు మద్దతు తెలిపారు. జెడియు అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి ఇటీవలే తప్పుకున్న త్యాగి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు రాజకీయ సలహాదారుగా మాత్రం కొనసాగుతున్నారు.