హైదరాబాద్ విమానాశ్రయంలో కవితకు ఘనవీడ్కోలు పలికిన బిఆర్‌ఎస్ కార్యకర్తలు
‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్ : ద తెలంగాణ మోడల్‘ అనే అంశంపై రాష్ట్ర అభివృద్ధిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించనున్న కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వలో తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయడానికి ఆదివారం నాడు బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత యుకెకు బయలుదేరి వెళ్లారు. ‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్ : ద తెలంగాణ మోడల్‘ అనే అంశంపై ఈ నెల 30న కీలకోపన్యాసం చేయాల్సిందిగా కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆదివారం నాడు బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ విమానాశ్రయంలో కవితకు ఘనవీడ్కోలు పలికారు. అంతర్జాతీయ వేదికపై సిఎం కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిని అవిష్కరించే అవకాశం లభించినందుకు కార్యకర్తలు కవితను అభినందించి శుభకాంక్షలు తెలియజేశారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందడం, అంతర్జాతీయ వేదికపై మన రాష్ట్ర ఘనతను చాటిచెప్పడం తెలంగాణకు గర్వకారణమని కొనియాడారు.
తెలంగాణ ప్రగతిపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న కవిత
సిఎం కెసిఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పనపై అంతర్జాతీయ వేదికపై కవిత వివరించనున్నారు. గత పదేళ్ల పాలనలో సిఎం కెసిఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని ఆకర్షించాయి. తెలంగాణలో వ్యవసాయం, విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ తదితర అంశాలపై కవిత ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సిఎం కెసిఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు అంశాలపై కవిత ప్రసంగిస్తారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడం, రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే మిగులు విద్యుత్తుకు చేరుకోవడానికి సిఎం కెసిఆర్ చేసిన కృషితో పాటు మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీళ్లును సరఫరా చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మత్తు చేయడం వంటి వివరాలను వివరించనున్నారు. వైద్య, విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కూడా యూనివర్సిటీలో కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు. హైదరాబాద్ పట్టణ అభివృద్ధి, భద్రత, మౌలిక సదుపాయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.