Friday, November 15, 2024

అది రాజకీయ దర్భార్

- Advertisement -
- Advertisement -

గవర్నర్ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు
రాజ్యాంగ వ్యవస్థలపై సిఎం కెసిఆర్‌కు అపార గౌరవం ఉంది
టిఆర్‌ఎస్ శాసనసభ్యుడు వివేకానంద

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై నిర్వహించింది ప్రజా దర్భార్ కాదని….అది పూర్తిగా రాజకీయ దర్భార్ అని టిఆర్‌ఎస్ శాసనసభ్యుడు కె.పి. వివేకానంద ఆరోపించారు. ఆమె తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆపారమైన గౌరవం ఉందన్నారు. అయినప్పటికీ టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో పలుచన చేయాలన్న ఉద్దేశ్యంతోనే గవర్నర్ పలు వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. తమిళిసై గవర్నర్‌గా కాకుండా ఒక రాజకీయ నేతగానే వ్యవగహరిస్తుండడం శోచనీయమన్నారు.

శుక్రవారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో వివేకానంద మాట్లాడుతూ, గవర్నర్ ప్రజా దర్బార్‌పై స్పందించారు. బిజెపి గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. గవర్నర్ ప్రజాదర్బార్‌కు రాష్ట్ర ప్రభుత్వం జవాబు దారికాదన్నారు. ఓట్లేసిన ప్రజలకే తాము జవాబు దారీ అని అన్నారు. గుజరాత్‌లో మోడీ సిఎంగా ఉన్నపుడు అక్కడ గవర్నర్ కమల బేనివాల్ ప్రజా దర్బార్ పెడితే ఆమెను తొలగించాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఫిర్యాదు చేయడం నిజం కాదా? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అలాగే యుపిలో 2014లో బిజెపి ప్రతిపక్షంలో ఉన్నా అప్పటి గవర్నర్ అజీజ్ ఖురేషి రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపిస్తూ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేయలేదా? అని నిలదీశారు.

బిజెపి నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్‌లను నియమించే పద్దతిపై బోలెడు నీతులు బోధించారని వ్యంగ్యస్త్రాలను సంధించారు. మోడీ సిఎంగా ఉన్నపుడు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళను గవర్నర్‌లుగా నియమించాలని డిమాండ్ చేశారన్నారు. కానీ ఇప్పుడేమో మోడీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. తాము ఇప్పటి వరకు గవర్నర్‌ను తొలగించాలని డిమాండ్ చేయలేదన్నారు. కేవలం గవర్నర్ లక్ష్మణ రేఖ దాటొద్దు అని మాత్రమే చెబుతున్నామన్నారు. రాజ్యాంగ పదవులకు టిఆర్‌ఎస్ ఎప్పుడు గౌరవం ఇస్తుందన్నారు. రాష్ట్ర హాక్కులను కేంద్రం కాల రాస్తోందన్నారు. గవర్నర్ తన గౌరవాన్ని తానే కాపాడుకోలేక పోతున్నారన్నారు.

రేవంత్ ఒక అజ్ఞాని
పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక అజ్ఞానీ అని వివేకానంద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సెక్షన్ 8ను తెరపైకి తెస్తున్నారన్నారు. రాష్ట్రంలో గవర్నర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. కానీ సెక్షన్ 8 ఏ పరిస్థితుల్లో ప్రయోగించవచ్చో ముందుకు రేవంత్ తెలుసుకుంటే మంచిదన్నారు. సిఎం కెసిఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో అన్ని పార్టీలు ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని మండిపడ్డారు. రెండోసారి కెసిఆర్ మరింత ప్రజాదరణతో సిఎం అయ్యారన్నారు. ఆ సంగతి అందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News