Monday, November 25, 2024

సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని

- Advertisement -
- Advertisement -

 

K Samba Shiva Rao CPI Telangana Secretary

సిపిఐ పార్టీ చరిత్రలో తొలిసారి ఎన్నిక నిర్వహణ

రంగారెడ్డి: సిపిఐ తెలంగాణ కార్యదర్శి పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ పోస్టు కోసం పార్టీ చరిత్రలోనే తొలిసారి నిర్వహించిన ఎన్నికల్లో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. ప్రత్యర్థి పల్లా వెంకట్‌రెడ్డిపై ఆయన 14 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో నాలుగు రోజులపాటు పార్టీ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్‌ హాలులో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి 2.30 గంటల వరకు హైడ్రామా మధ్య కార్యదర్శి ఎన్నిక కొనసాగింది. పదవి తమకే ఇవ్వాలని ఇద్దరు నేతలు పట్టుబట్టడంతో చివరకు ఎన్నికలు నిర్వహించారు. 110 కౌన్సిల్‌ సభ్యులు ఓటింగ్‌కు హాజరవగా కూనంనేనికి 59, పల్లా వెంకట్‌రెడ్డికి 45 ఓట్లు పోలయ్యాయి. కొత్తగూడెం ఎమ్మెల్యేగా పనిచేసిన కూనంనేని సిపిఐ 3వ మహాసభ వరకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక చాడ వెంకట్‌రెడ్డి రెండుసార్లు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మూడోసారి కూడా తనకే అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, ఈసారి తనకు కార్యదర్శి పదవి ఇవ్వాలని కూనంనేని ముందుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా పల్లా వెంకట్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పల్లాకు అవకాశం ఇవ్వాలని చాడ ప్రతిపాదించారు. పార్టీ అధిష్ఠానం ఎంత బుజ్జగించినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో కూనంనేని, పల్లా మధ్య ఓటింగ్‌ అనివార్యమైంది. సమయం లేకపోవడంతో ఇంకా కార్యదర్శి వర్గ సభ్యులను ఎన్నుకోలేదు. ప్రస్తుతం ఆ ప్రక్రియను వాయిదా వేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కూనంనేని సాంబశివరావు ఐదు దశాబ్దాలుగా సిపిఐలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాలాంధ్ర దినపత్రికలో డెస్క్‌ జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన అనంతరం కొత్తగూడెంలో విశాలంధ్ర విలేకరిగా పనిచేశారు. తర్వాత పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. 1984లో సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా పనిచేశారు. 1987లో కొత్తగూడెం ఎంపిటిసిగా గెలుపొందారు. 1999లో కొత్తగూడెం నుంచి సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో సుజాతనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2005లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2009 లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిపిఐ శాసనసభ పక్ష ఉపనాయకుడుగా కూడా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News