హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్‌ను మంగళవారం నాడు పోలీసులు గృహనిర్భంధం చేశారు. కె ఎ పాల్ మంగళవారం ఉదయం డిజిపి మహేందర్ రెడ్డిని కలిసేందుకు బయలుదేరిన క్రమంలో పోలీసులు ఇంటి వద్దనే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం తనపై జరిగిన దాడి గురించి డిజిపి ఫిర్యాదు చేస్తానని అందుకే వెళ్తున్నట్లు చెప్పినప్పటికీ పోలీసులు ఆయన్ని గృహనిర్భంధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్తుండగా కెఎ పాల్ పై చేయి చేసుకున్నారు. అదేవిధంగా కెఎపాల్ పర్యటనకు అనుమతి లేదని జిల్లాకు రాకుండా పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కెఎ పాల్ పోలీసులతో మాట్లాడుతుండగానే అక్కడే ఉన్న ఓ వ్యక్తి పాల్ చెంప పగలగొట్టారు. కెఎ పాల్ చెంపపై కొట్టడంతో గందరగోళం నెలకొంది. అక్కడున్న వారు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు కెఎ పాల్ తన వాహనంలో ఎక్కించి హైదరాబాద్ వైపు తరలించారు. ఈ విషయమై మంగళవారం కెఎ పాల్ రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా పోలీసులు గృహనిర్భంధం చేశారు.