సంపాదకీయం: అమెరికా ఖాళీ చేసి వెళ్లిన తర్వాత అఫ్ఘానిస్తాన్‌తో తిరిగి పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకోడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు మొట్టమొదటి సారి ఎదురుదెబ్బ తగిలినట్టు స్పష్టపడుతున్నది. కాబూల్‌కు న్యూఢిల్లీ చేరువ కాకుండా పాకిస్తాన్ అడ్డుకుంటున్నట్టు బోధపడుతున్నది. అఫ్ఘాన్‌లోని 111 మంది సిక్కుల, హిందువుల వీసా దరఖాస్తులకు భారత్ ఉన్నట్టుండి ఆమోద ముద్ర వేసింది. కాబూల్‌లోని గురుద్వారాను మొన్న సోమవారం నాడు దుండగులు పేల్చివేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకొన్నది. మహమ్మద్ ప్రవక్తపై బిజెపి ప్రతినిధుల వ్యాఖ్యకు నిరసనగా తామే గురుద్వారాను పేల్చివేసినట్టు పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రకటించింది.
అఫ్ఘానిస్తాన్‌లోని ఖొరసానా రాష్ట్రానికి చెందిన ఐఎస్‌ఐ విభాగం ఈ దారుణానికి పాల్పడినట్టు వెల్లడైంది. ఈ పేలుడులో వొక సిక్కు ప్రముఖుడు సహా ముగ్గురు మరణించారు. అమెరికా గత ఆగస్టులో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాబూల్‌లో అధికారాన్ని తాలిబాన్లు కైవసం చేసుకొన్న సంగతి, దాని వెనుక ఐఎస్‌ఐ హస్తం ఉన్న వాస్తవమూ తెలిసిందే. ఆ తర్వాత అక్కడి నుంచి చాలా మంది భారతీయులు స్వదేశానికి వచ్చేయగా ఇంకా 159 మంది మాత్రమే అక్కడ మిగిలారు. వారిలో అధికులు సిక్కులు. వీరు కూడా గత యేడాది సెప్టెంబర్‌లోనే భారత వీసాల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. భద్రతా కారణాల వల్ల వాటిని పెండింగ్‌లో ఉంచారు. గురుద్వారాను పేల్చివేస్తామన్న బెదిరింపులు రావడంతో వీటిని ఆమోదించాలంటూ సిక్కుల నుంచి వొత్తిడి పెరిగింది. గత ఫిబ్రవరి 19న అఫ్ఘాన్ హిందూ, సిక్కు ప్రతినిధి వర్గం ప్రధాని మోడీని కలుసుకొని ఈ వీసాల మంజూరుకు విజ్ఞప్తి చేసింది. అమెరికా ఉపసంహరణ తర్వాత దుబాయ్, రష్యాలకు వెళ్ళిపోయిన 80 మందికి పైగా సిక్కులు భారత వీసాల కోసం యెదురు చూస్తున్నారు. కాబూల్‌లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై శనివారం ఉదయం జరిపిన దాడిలో భారత్‌పై పాక్ సైన్యం పన్నిన లోతైన పన్నాగం యిమిడి వున్నట్టు తెలుస్తున్నది.
ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇండియాపై వ్యతిరేకతను పెంచడంతో బాటు కాబూల్‌కు భారత్ చేరువ కాకుండా చూడడం కూడా అందులో భాగమేనని బోధపడుతున్నది. అఫ్ఘానిస్థాన్‌లోని సిక్కుల మీద ఉగ్రవాదులు చాలా కాలంగా పగబట్టి వున్నారు. 1970 దశకంలో అఫ్ఘాన్‌లో లక్ష మంది వరకు సిక్కులు ఉండేవారు.ఉగ్రవాదుల దాడులు పెరగడంతో బాగా పలచబడిపోయారు. 2020లో మరో గురుద్వారాపై జరిగిన దాడిలో ఇరవై మందికిపైగా సిక్కులు దుర్మరణం పాలయ్యారు. తాలిబన్లు మళ్లీ ప్రాబల్యం సంపాదించుకొన్ననాటికి కేవలం 300 మందికి పైగా మాత్రమే మిగిలారు. అమెరికా నిష్క్రమణ, తాలిబన్ల అధికార పునరుద్ధరణ సమయంలో చెలరేగిన హింసాకాండ తెలిసిందే. ఆ పరిస్థితుల్లో అఫ్ఘానిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం, దౌత్య కార్యాలయాలు మూతబడ్డాయి. ఇటీవలి కాలంలో అఫ్ఘాన్‌తో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని ఇండియా సంకల్పించింది.అందుకు అనువుగా కాబూల్‌లో రాయబార కార్యాలయాన్ని, వీసా జారీ సదుపాయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నది.
ఈ వైపుగా ప్రాధమిక చర్యలు తీసుకోడమూ జరిగింది. మన విదేశాంగశాఖ సంయుక్త కార్యదర్శి జెపి సింగ్ బృందం గత జూన్ 2న కాబూల్ వెళ్లి అఫ్ఘాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రిని కలుసుకొని చర్చలు జరిపింది. ఈ వైపుగా ఇటీవల సన్నాహాలు ముమ్మరమయ్యాయి. అమెరికా సైన్యం అక్కడ ఉన్నప్పుడు భారత రాయబార కార్యాలయంపై హక్కానీ ఉగ్రవాదుల దాడి జరిగిన సంగతి విదితమే. అయితే తాలిబన్లు వచ్చిన తర్వాత ఇండియాతో మెరుగైన సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు భారత ప్రభుత్వంపై వొత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతానికి కాబూల్‌లో స్థానిక అఫ్ఘాన్ల ఆధ్వర్యంలో భారత దౌత్య కార్యాలయం వంటిది చిన్నది నడుస్తున్నది. పూర్తి స్థాయి రాయబార కార్యాలయాన్ని యేర్పాటు చేస్తే ఉగ్ర దాడులు జరుగుతాయనే హెచ్చరికలూ ఉన్నాయి. రష్యా, చైనా, ఇరాన్, ఇండోనేసియా, టర్కీ తదితర 13 దేశాలు కాబూల్‌లో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేశాయి.
అమెరికా కూడా పరోక్ష ఏర్పాటు ద్వారా తన రాయబార వ్యవస్థను నెలకొల్పింది. భారత రాయబార కార్యాలయం ఏర్పాటు కావడం పాకిస్థాన్‌కు బొత్తిగా ఇష్టం లేదు. దానిని గట్టిగా అడ్డుకోడానికే మొన్నటి గురుద్వారా దాడి జరిగిందని భావిస్తున్నారు. గురుద్వారాపై దాడిని ఇండియా ఐక్యరాజ్య సమితిలోనూ తీవ్రంగా ఖండించింది. తాలిబాన్లు స్వయంగా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి ప్రమాదం పొంచి వున్నప్పటికీ అన్ని జాగ్రత్తలతో కాబూల్‌లో మన రాయబార కార్యాలయం ఏర్పాటుకే ప్రాధాన్యత ఇవ్వాలి.