బ్రిటన్ విదేదాంగ శాఖ మంత్రి వెల్లడి
లండన్ : అఫ్గాన్‌స్థాన్ నుంచి తమ పౌరులు, సైనిక సిబ్బంది, శరణార్ధుల తరలింపు ప్రక్రియను పశ్చిమ దేశాలు వేగవంతం చేశాయి. ఈ విధమైన తరలింపు ఎప్పటికి పూర్తవుతుందో కచ్చితమైన సమయాన్ని తాను చెప్పలేక పోయినప్పటికీ ఆగస్టు 31 కి మాత్రం కాబూల్ మిషన్ పూర్తవుతుందని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ స్పష్టం చేశారు. ఈ నెలాఖరునాటికి తమ బలగాలను అక్కడి నుంచి పూర్తిగా ఉపసంహరించుకోనున్నట్టు చెప్పారు. తమ దేశ పౌరులను , సామగ్రిని కాబూల్ నుంచి ఉపసంహరించుకొనేందుకు తమ సైన్యానికి కొంత సమయం అవసరమైనప్పటికీ, ఉన్న సమయాన్నే సమర్ధంగా ఉపయోగించుకుంటామని తెలిపారు.
కాబూల్‌ను తాలిబన్లు వశం చేసుకున్న రోజు (ఆగస్టు 15) నుంచి ఇప్పటిదాకా 9 వేల మంది బ్రిటిష్ పౌరులు, ప్రమాదంలో ఉన్న అఫ్గాన్‌లను బ్రిటిష్ సైన్యం తరలించిందని చెప్పారు. అఫ్గాన్ నుంచి తరలింపు ప్రక్రియను ఇంకొంత కాలం పొడిగించాలంటూ బ్రిటన్ సహా అనేక మిత్ర దేశాలు ఒత్తిడి చేసినప్పటికీ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అంగీకరించలేదు. తరలింపు ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కాబూల్ విమానాశ్రయంలో ప్రజలను సురక్షితంగా తరలించడానికి దాదాపు 6 వేల మంది అమెరికా బలగాలు పనిచేస్తున్నాయి.