Saturday, January 11, 2025

నాకు ఆ రెండూ కావాలి: కాజల్

- Advertisement -
- Advertisement -

రెండు దశాబ్దాల కెరీర్ లో స్టార్ హీరోలకు జంటగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీలోనూ నటించి పేరు తెచ్చుకుంది. 60 సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో నటించి ’క్వీన్ ఆఫ్ మాసెస్’ గా ప్రేక్షకుల అభిమానం పొందిన కాజల్…ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లాంటి కెరీర్ ను మొదలుపెట్టింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో సత్యభామగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ చిత్రంలో నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషించారు. అవురమ్ ఆర్ట్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న సత్యభామ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…

సమాజంలో ఏదైనా జరిగితే స్పందిస్తుంటా…
సత్యభామ మూవీని నా పర్సనల్ లైఫ్‌తోనూ పోల్చుకోవచ్చు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ లా ..నిజ జీవితంలో నేనూ సమాజంలో ఏదైనా జరిగితే స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా..ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందరిలాగే సొసైటీలో జరిగేవాటి గురించి నాకూ కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి.
అవన్నీ రియలిస్టిక్‌గా అనిపిస్తాయి…
నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్‌గా అనిపిస్తాయి.
నాకు రెండూ కావాలి…
నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్‌ఫుల్ నేమ్. ఈ కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి.
బాగా వచ్చేలా చూసుకున్నారు…
శశికిరణ్ మంచి డైరెక్టర్. ఆయన సినిమాలు చూశాను. ఈ సినిమాకు డైరెక్షన్ ఎందుకు చేయడం లేదని శశిని అడిగాను. ఆయన తను ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇస్తూ సమర్పకుడిగా ఉంటున్నానని చెప్పారు. శశి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించా. ఆయన ఈ ప్రాజెక్ట్‌ను అన్ని విధాలా బాగా వచ్చేలా చూసుకున్నారు.
అందుకే నా సొంత బ్యానర్ అని చెప్పా…
దర్శకుడు సుమన్ చిక్కాల ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తున్నా..ఎంతో బాగా సినిమాను తెరకెక్కించారు. మా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్లైనా తమ ఫస్ట్ మూవీని ఓ బేబిని చూసుకున్నట్లు చూసుకున్నారు. ప్రతి రోజూ సెట్‌లో ఉంటూ అన్ని విషయాల్లో జోక్యం చేసుకునేవారు. తొలి సినిమాను ఎంతో జాగ్రత్తగా నిర్మించారు. అందుకే అవురమ్ ఆర్ట్ నా సొంత బ్యానర్ అని చెప్పా.
యాక్షన్ కోసం ఎంతో కష్టపడ్డా…
సత్యభామ సినిమాలో ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. పోలీస్ రోల్స్ గతంలో ఎంతోమంది హీరోయిన్స్ చేసి ఉంటారు. కానీ ఇది నాకు కొత్త. నా తరహాలో పర్ ఫార్మ్ చేశాను. అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నా. – సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి.
ఆ సినిమాలో డిఫరెంట్ రోల్‌లో కనిపిస్తా…
భారతీయుడు 2 సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. భారతీయుడు 3 మూవీలో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో నేను చాలా కొత్తగా డిఫరెంట్ రోల్‌లో కనిపిస్తా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News