Monday, November 18, 2024

కాకతీయ వైభవం

- Advertisement -
- Advertisement -

కన్నుల పండువలా ప్రారంభమైన సప్తాహం

కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్‌కు ఘన స్వాగతం ప్రత్యేక
ఆకర్షణగా నిలిచిన ఊరేగింపు భద్రకాళి ఆలయం, ఖిల్లా వరంగల్,
వేయిస్తంభాల ఆలయం, అగ్గలయ్యగుట్టను దర్శించుకున్న కమల్ చంద్ర
కాకతీయుల వైభవం ఉట్టిపడేలా కళారూపాల ప్రదర్శన

మన తెలంగాణ/హన్మకొండ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాకతీయ వైభవ సప్తాహం హన్మకొండలో గురువారం అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా మొదటిరోజు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ ముఖ్యఅతిథిగా హాజరు ఆయనకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ ఘన స్వాగతం పలికారు. నగరానికివచ్చిన ఆయన తొలుత కాకతీయుల ఇష్టదైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాల ద్వారా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పోచమ్మమైదాన్‌లో రాణిరుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అక్కడి నుంచి వరంగల్ కోటకు చేరుకున్నారు. గుర్రాలబండిపై కాకతీయ వారసుడు కమల్ చంద్రను నగరవాసులు ఊరేగింపుగా తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాకతీయుల చరిత్రను తెలుసుకోవడంతో పాటు కళా సంపదను ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. వేయిస్తంభాల దేవాలయం, అగ్గలయ్యగుట్ట దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరగా కాకతీయ హరిత హోటల్‌లో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల వంశంలో పుట్టడం నా అదృష్టంగా, గర్వంగా ఉందన్నారు. పూర్వీకుల కళా సంపద అద్వితీయం, అపూర్వమైనదన్నారు. ఓరుగల్లు ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కాకతీయుల గొప్పతనాన్ని గుర్తుంచుకొని వేడుకలు నిర్వహిస్తున్నందుకు, వేడుకల్లో తనను భాగస్వామిని చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో కాకతీయ వైభవ వేడుకలను కాకతీయుల కళావైభవం, ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించేవిధంగా నిర్వహిస్తున్నామన్నారు. వారంరోజులపాటు వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు భాగస్వాములై వేడుకలను విజయవంతం చేయాలన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కళలకు, కళాకారులకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయులు సాధించిన విజయాలు, వారి చరిత్ర గొప్పదని, వారి గురించి అందరికి తెలిసేలా ఈవేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందుకు సహకరించిన సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లకు జిల్లా ప్రజలు రుణపడిఉంటారన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ కాకతీయుల వైభవం వారి చరిత్ర గురించి అందరికి తెలిసేలా ఈవేడుకలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. 13వ తేదీ వరకు ఏడు రోజులపాటు ఈ వేడుకలు జరుగుతాయని, ప్రజలంతా వేడుకల్లో పాల్గొనాలన్నారు. కాకతీయుల వైభవ సప్తాహం వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాజా కమల్ చంద్ర భంజ్‌దేవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జిల్లాగా వరంగల్‌కు గుర్తింపు ఉందన్నారు. ఇందుకు కాకతీయులు రాజధానిగా ఓరుగల్లు కావడమే కారణమన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎంపి పసునూరి దయాకర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, డాక్టర్ గోపి, సిపి తరుణ్‌జోషి, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య, వివిధ శాఖ అధికారులు, జిల్లా వాసులు పాల్గొన్నారు.

మా వంశస్తుల గడ్డకు రావడం సంతోషంగా ఉంది: కమల్ చంద్ర భంజ్ దేవ్
“మా వంశస్తుల గడ్డకు రావడం సంతోషం” అని కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ అన్నారు. గురువారం కాకతీయ వైభవ సప్తాహం ఉత్సావాలను ప్రారంభించేందుకు కమల్ చంద్ వరంగల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కాకతీయ వారసుడు విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇక్కడ నుండి వెళ్ళినా బస్తర్‌లో సమాజసేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కాకతీయ ఉత్సవాలు జరపడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ప్రజలు మా పుర్వీకులైన కాకతీయులను ఇంతలా ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తనను ఆహ్వానించిన నాయకులకు కమల్ చంద్ర భంజ్ దేవ్ ధన్యవాదాలు తెలిపారు.

Kakatiya Vibhava Saptaham begins in Hanamkonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News