కీవ్ : దక్షిణ ఖేర్సన్ వద్ద కఖోవ్కా డ్యాం వరద ముంపు ప్రదేశాలు ప్రమాదకరంగా మారాయి. ఇక్కడ ఉక్రెయిన్, రష్యాదళాలు అమర్చిన యాంటీ ట్యాంక్ మైన్లు ( మందుపాతరలు) కొట్టుకుని పోవడంతో అవి ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియడం లేదు. దీంతో మందుపాతరలను గుర్తించి తొలగించడం కష్టంగా మారిందని రెడ్‌క్రాస్ పేర్కొంది. ముఖ్యంగా ఇక్కడ టీఎం57 మైన్లను అమర్చారు. అయితే వరద జోరుకు అవి దిగువ ప్రదేశాలకు కొట్టుకుపోయాయి. అవి ప్రజలకే కాదు, సహాయక బృందాలకు కూడా ప్రమాదంగా మారాయని రెడ్‌క్రాస్ చెబుతోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురువారం వరద ముంపు ప్రాంతాలలో పర్యటించారు. ప్రజలను ఖాళీ చేయించిన ప్రదేశాలకు కూడా ఆయన వెళ్లి చూశారు. ఎమర్జెన్సీ వర్కర్లకు అనేక సూచనలు చేశారు. సహాయక బృందాలకు ధన్యవాదాలు తెలిపారు. దక్షిణ ఖేర్సాన్‌లో దాదాపు 600 కిమీ మేర భూభాగం నీట మునిగింది. చాలా చోట్ల నీటి మట్టం 5.61 మీటర్లకు చేరింది.
ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు డ్రోన్ల సాయంతో వాటర్ బాటిళ్లు అందిస్తున్నారు.