Wednesday, January 22, 2025

కొత్త కిరికిరి

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరానికి జాతీయ హోదా అర్హతే లేదట!

పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి నిస్సిగ్గుగా ప్రకటన
 అనుమతులే తీసుకోలేదంటూ అడ్డగోలు వాదన 
2017లోనే సిడబ్లూసి క్లియరెన్స్ పొందిన రాష్ట్రం
 రిజర్వ్ బ్యాంక్ అనుమతి సంస్థల ద్వారా రుణ సాయం
హోదా కోసం ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందించని కేంద్రం
తాజాగా ఐపర్ స్టీరింగ్ కమిటీ అంటూ కొత్త పల్లవి

మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయంగా ప్రసిద్ది గాంచిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం అనేక కుంటిసాకులను తెరపైకి తీసుకు వచ్చింది. తెలంగాణ రా ష్ట్రాన్ని ఆర్థ్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తూ సహాయ నిరా కరణ సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడానికి ఇష్టంలేక అనేక మెలికలు పెడుతూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు తారా స్థాయికి చేరుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడూ చేసిన ప్రకటనపై టిఆర్‌ఎస్ పార్టీ ఎంపిలతో మరి కొన్ని పార్టీల సభ్యులు సైతం మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తూర్పారబట్టారు. బీజేపి పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో అప్పర్ తుంగ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ హోదా కల్పించింది. అయితే ఈ ప్రాజెక్టులకు ఏ కమిటీ సిఫార్సు చేస్తే జాతీయహోదా ఇచ్చారో తెలపాలని, ఎవరూ సిఫార్సు చేయకపోయినా మీకిష్టమైతే హోదా ఇస్తారా అని నిలదీశారు. ఇష్టం లేకపోతే ఎన్ని కమిటీలు సిఫార్సుచేసినా, మరెన్ని అర్హతలు ఉన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఎంపిలు కేంద్రం తీరును ఎండగడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాం తానికి జరుగుతున్న అన్యాయాలను భరించలేకే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఉద్యమించిన ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నారు. ప్రత్యేక రా్రష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో దూరదృష్టితో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రపంచంలోనే అరుదైన రీతిలో, నీటివనరుల రంగంలో అత్యంత అధునాత సాంకేతికతను ఉపయోగించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని 2016లోనే సిఎం కేసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడికి విజ్ణప్తి చేశారు. 2018లో కూడా మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేందుకు అవరసమైన అన్ని అర్హతలను కేంద్ర జల్‌శక్తి నివేదికల ద్వారా వివరించారు. లేఖలు రాశారు. తెలంగాణ రా్రష్ట్ర తాగు, సాగు నీటి అవసరాల ఉన్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిధుల కోసం ఎదురు చూడకుండా రా్రష్ట్ర ప్రభుత్వమే తన సొంత వనరుల ద్వారా ఈ ప్రాజెక్టు పనులు చేపట్టింది. గోదావరి జలాల నుంచి 180టిఎంసీల నీటి ని మెరక ప్రాంతాలకు ఉపయోగించుకునేలా రూ పొం దించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 2017 అక్టోబర్ 30న కేంద్ర జలవనరుల సంఘం నుంచి హైడ్రాలజి క్లియరెన్సులతోపాటు ఇతర అనుమతులు లభించాయి.
కుంటి సాకులతో కేంద్రం అభాసుపాలు
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కింద చేర్చడానికి అర్హత లేదని కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు పార్లమెంట్‌లో గురువారం చేసిన ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం తన వివక్షతను మరో సారి బయటపెట్టుకున్నట్టయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నతో కేంద్రం కక్షపూరిత వైఖరి పార్లమెంట్ సాక్షిగా వెల్లడయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుకోసం తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు తీసుకోలేదని కేంద్ర మంత్రి నిస్సిగ్గుగా వెల్లడించారు. అనుమతులు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును హైపరవ్ స్టీరింగ్ కమిటి పరిశీలించాలని, హైపవర్ కమిటి అనుమతులు ఉంటే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉందని కేంద్ర సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడు ద్వారా మోడి సర్కారు పార్లమెంటులో కొత్తపల్లవి వినిపించింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టుబడుల అనుమతులు కూడా లేవని జలశక్తి శాఖ మంత్రి ద్వారా కేంద్ర బిజేపి సర్కారు చేసిన ప్రకటన తెలంగాణ ప్రాంత ప్రజలను మరింత ఉడుకెత్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకోసం ఒక్క పైసా ఇవ్వకపోయినా రా్రష్ట్ర ప్రభుత్వమే వేలకోట్ల రూపాయాల వ్యయానికి సాహసించింది. రిజర్వ్ బ్యాంకు అనుతులతో ఏర్పడిన ఆర్ధిక సంస్థల ద్వారా రుణ సహాయాన్ని అందిపుచ్చుకుంది. అంతే కాకుండా తీసుకున్న రుణాలను కూడా క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తు ఆర్ధిక సంస్థలలో కేసిఆర్ సర్కారు తన క్రెడిబులిటిని మరింత పెంచుకుంది. సాగునీటిరంగంలో ప్రత్యేకించి ఎత్తిపోతల టెక్నాలజిలో ప్రపంచ బాహుబలిగా ప్రపంచ మీడియా ద్వారా ప్రశంసలు పొందిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రం కొత్తమెళికలు పెట్టడం నిపుణులను సైతం విస్తుపోయేలా చేసింది. జాతీయ హోదా కావాలంటే కేంద్ర జలసంఘం అధ్యయనం తప్పని సరి అని, ప్రాజెక్టు అడ్వయిజరీ కమిటీ ఆమోదం కూడా తీసుకోవాలని, ప్రాజెక్టు పెట్టుబడులకు అనుమతి ఉంటే హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలన చేసి అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ ద్వారా కేంద్ర బీజేపి ప్రభుత్వం చేయించిన కొత్త ప్రకటన కేంద్రం డొల్లతనాన్ని బయటపెట్టింది. పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించిన ఈ కమిటీలన్నీ కేంద్ర జల్‌శక్తి శాఖ చేతుల్లో ఉన్నవే కావటం గమనార్హం. 2018జనవరిలోనే ఈ ప్రాజెక్టును కేసిఆర్ సర్కారు జాతికి అంకితం ఇచ్చింది. అన్ని అనుమతులతో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్టుకు ఇప్పడు అర్హతలు లేవని కేంద్ర మంత్రి టుడుతో పార్లమెంట్‌లో చేయించిన ప్రకటన తెలంగాణ ప్రజల్లో కాళేశ్వరం పట్ల ప్రధాని మోడి కడుపు మంటను బట్టబయలు చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Kaleshwaram Not Eligible for National Status : Center

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News