ఏర్పాటు దిశగా కార్యాచరణ
గీత వృత్తిని ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది
గౌడసంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం
మన తెలంగాణ/మహబూబ్‌నగర్ రూరల్ : రాష్ట్రంలో రానున్న రోజుల్లో ‘కల్లు బార్ల్లు’ ఏర్పా టు చేసే దిశగా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గౌడ సంఘం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమా ర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎఎస్‌ఎన్ ఫంక్షన్ హాల్‌లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళ నం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలానుగుణంగా కులవృత్తులు మారుతున్నాయని, అన్ని రకాల వ్యాపారాల తీరు మారుతోందని అన్నారు.
ఈ నేపథ్యంలో అనాదిగా వస్తున్న కల్లుగీత వృత్తి నేడు కనుమరుగు అవుతుందని ఈ వృత్తిని కాపాడాల్సి అవసరం ఉందన్నారు. గీత కార్మికుల వృత్తిని కూడా ఆధునికీకరించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. అందులో భాగంగా కల్తీ కల్లు లేకుండా గౌరవప్రదంగా విక్రయించే దిశగా ప్రభుత్వపరంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందని, దీనివల్ల ఎంతోమందికి మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్‌బండపై ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు ఎంఎల్‌ఎలు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి, మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.