మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రివర్యులు కెటిఆర్ గీతన్నలపై వరాల జల్లు కురిపించారు. వృత్తిలో ప్రమాదాలు నివారించే చర్యలు తీసుకుంటామని, గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తామని, లిక్కర్ షాపులలో గౌడులకు ఇచ్చే 15% రిజర్వేషన్లు సొసైటీలకు ఇస్తామని, గీతన్న బీమా పథకం, గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయనిచ్చిన హామీలను బిఆర్‌ఎస్ సర్కార్ నేటి వరకు అమలు చేయలేదు. లిక్కర్ షాప్ టెండర్లలో వ్యక్తులకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల పేద గౌడులకు ఏమాత్రం లాభం లేదని తాము పలుమార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాం. అందరికీ న్యాయం జరగాలి, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే లిక్కర్ షాప్ టెండర్లలో వ్యక్తులకు కాకుండా సొసైటీలకు రిజర్వేషన్స్ కల్పించాలని కోరాము. సొసైటీలకే రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి కెటిఆర్ చెప్పినప్పటికీ మొన్నటి టెండర్లలో పాత పద్ధతినే కొనసాగించారు.
ద్విచక్ర వాహనాలు ఇస్తారని గత రెండు సంవత్సరాల నుండి ఆశతో ఎదురు చూస్తున్న కల్లు గీత కార్మికులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 202324 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించామని చెప్పారు. బడ్జెట్ పత్రంలో మాత్రం రూ. 30 కోట్లు మాత్రమే చూపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కల్లు గీత కార్పొరేషన్ పేరుకు మాత్రమే ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు పదేళ్లకు రాష్ర్ట ప్రభుత్వం కార్పొరేషన్‌కు చైర్మెన్‌ను ఎట్టకేలకు నియమించింది. దీని వలన గీత కార్మికులకు అదనపు ప్రయోజనం ఒనకూడింది లేదు. కార్పొరేషన్‌కు తగిన బడ్జెట్ కేటాయించకుండా, వృత్తిలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోకుండా ఎన్నిమాటలు చెప్పినా నీటి మూటలుగానే మిగిలిపోతాయి. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్న తెలంగాణ రాష్ర్టంలో కల్లుగీస్తున్న గౌడన్నల బతుకులకు భరోసా లేకుండాపోయింది. తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాది మంది చనిపోతున్నారు. కాళ్లు చేతులు విరుగుతున్నాయి.
నడుములు పడిపోయి మంచాన పడుతున్నారు. అచేతనావస్థలో ఉన్న వారు చావలేక బతుకులీడుస్తున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏటా సగటున 550 మంది గౌడన్నలు చెట్టుపై నుంచి జారిపడుతున్నారు. వారిలో సగటున 180 మంది చనిపోతున్నారు. అంటే ప్రతి రెండు రోజులకు ఒక గీత కార్మికుడు చనిపోతున్నారు. కల్లు గీత వృత్తిలో వున్నంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు. ప్రపంచం అత్యాధునిక టెక్నాలజీతో చంద్రయాన్ లాంటి విజయవంతమైన ప్రయోగాలు చేస్తున్న ఈ తరుణంలో సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న గీత వృత్తిలో సాంకేతికత పెంచాల్సిన అవసరం ఉంది. వీరిని ఈ ప్రమాదాల నుండి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. వృత్తిలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి. సురక్షిత మోకులు ఇవ్వాలి.ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రకటించిన గీతన్న బీమా నేటికీ అమలు కావడం లేదు. ఇటీవల బిసి కుల వృత్తిదారులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన రాగానే గీత కార్మికులు అనందంతో ఉప్పొంగిపోయారు. రాష్ర్ట బిసి సంక్షేమ శాఖ జిఒ ఎంఎస్ నెంబర్ 5 విడుదల చేయడంతో అర్హులైన వారు 13 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
గడువు సమయం కొద్ది రోజులే వుండడం వలన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందక పోవడంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. వీరిలో ఇప్పటి వరకు ఒక్కరికీ ఈ పథకం అమలు చేయలేదు. గీత కార్మికులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఏ పథకం ఇప్పటి వరకు అమలు కాలేదు. తమతోపాటు ఉన్న ఇతర బిసి కుల వృత్తిదారులలో కొందరికైనా ఎంతో కొంత ప్రయోజనం చేకూరే విధంగా సంక్షేమ పథకాలు వచ్చాయి. కొండంత ఆశలు పెట్టుకున్న గీతన్నలకు మాత్రం ఎండమావులే మిగిలాయి. గత అనేక సంవత్సరాలుగా సంఘాలు పోరాటం చేసిన ఫలితంగా 28 అక్టోబర్ 2019న తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నీరా పాలసీ తీసుకువచ్చింది. జిఒ ఎంఎస్ నెంబరు 116 విడుదల చేసింది. గౌడ, ఈడిగ కులాల వారు మాత్రమే నీరా తీయడం, సేకరణ, అమ్మకాలు చేయాలని దీనిలో ప్రకటించింది. రూ. 25 కోట్లు నీరా కోసం బడ్జెట్ కేటాయించింది. దీనితో నెక్లెస్ రోడ్‌లో నీరాకేఫ్ నిర్మాణం చేపట్టింది. 6 మే 2023న చాలా గొప్పగా ప్రారంభించింది. రంగారెడ్ది జిల్లా ముద్విన్, సంగారెడ్డి జిల్లా మునిపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్ , నందనం నుండి నీరా సేకరణ చేయాలని నిర్ణయించింది.
నందనంలో మిషనరీ ఏర్పాటు చేసి అక్కడ బై ప్రొడక్ట్స్ తయారు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ముద్విన్, చారుగొండ, చరికొండ, నాగిళ్ల గ్రామాల నుండి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నీరా సేకరణ జరుగుతుంది. నీరా కేఫ్‌లో అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. ఎక్కువ సెంటర్లలో అమ్మితే ఇంకా అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ప్రారంభంలో దీని నిర్వహణ టూరిజం శాఖకు అప్పగించారు. మాకు టాడి కార్పొరేషన్ ఉండగా దానికి ఇవ్వడం ఎందుకు కార్పొరేషన్ ద్వారానే నడపాలని సంఘాలు అప్పుడు అభిప్రాయపడ్డాయి. టూరిజం శాఖ అయితే దానికి అన్ని జిల్లాలలో హోటళ్ళు, ఇతర పర్యాటక కేంద్రాలు ఉంటాయి కాబట్టి మార్కెటింగ్ బాగా ఉంటుందని వారు అన్నారు. ప్రారంభమై ఐదు నెలలు కాకముందే నీరా కేఫ్ బిడ్డింగ్‌కు టూరిజం శాఖ 20 సెప్టెంబర్ 2023న నోటీసు ఇచ్చింది. మంచి లాభాలతో నడుస్తున్న ఈ కేఫ్‌ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సరైంది కాదు. రాష్ర్ట కల్లుగీత కార్పొరేషన్ ఉన్నది. దానికి ఒక యండి, చైర్మన్, 12 మంది ఉద్యోగులు, ఆఫీసు ఉన్నది. కార్పొరేషన్ లక్ష్యం గీత కార్మికులకు ఉపాధి కల్పించడం, ఆధునీకరణ పద్ధతులు అవలంబించడం.
అందుకని టెండర్ విధానాన్ని రద్దు చేసి టాడి కార్పొరేషన్‌కి అప్పగించి గీత కార్మికుల ఉపాధి మెరుగుపరచడం కోసం కృషి చేయాలి. గీత వృత్తిలో ఉపాధి పెరగాలంటే సొసైటీలకు చెట్ల పెంపకానికి భూమి ఇవ్వాలి. కల్లులోని పోషకాలను, ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలి. నీరా, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ప్రతి జిల్లా కేంద్రంలో నెలకొల్పి వృత్తిని ఆధునీకరించి గీత కార్మికులకు , గౌడ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలి. అందుకు రూ. 5 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలి. 2023- 24 బడ్జెట్‌లో గీత కార్మికులకు కేటాయించిన 30 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి ఖర్చు చేయాలి. ఉమ్మడి రాష్ర్టంలో గీత కార్మిక సొసైటీలకు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు రక్షణ లేకుండాపోతోంది. రియల్టర్ల కన్నుపడటంతో అన్యాక్రాంతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇందుకు గాను ఆయా సొసైటీల పరిధిలో ఉన్న భూములకు ప్రభుత్వమే రక్షణ కోసం కంచెలు నిర్మించాలి. ప్రతి సొసైటీకీ 5 ఎకరాల భూమి ఇవ్వాలనే జివొ నెం 560ని అమలు చేయాలి. హైబ్రీడ్ తాటి, జీలుగ, ఖర్జూర, ఈత చెట్లను అభివృద్ది చేసి సొసైటీలకు పంపిణీ చేస్తే భవిష్యత్‌లో యువతను ఆకర్షించేందుకు, మరణాలకు తగ్గించేందుకు వీలు కలుగుతుంది.
గీత వృత్తిలో ఎక్కడ ప్రమాదానికి గురై చనిపోయినా, శాశ్వత వికలాంగులైనా పది లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి కల్లుగీత కార్పొరేషన్ ద్వారా ప్రస్తుతం అమలు చేస్తున్న తక్షణ సాయాన్ని దహన ఖర్చులకు రూ. 50 వేలు, మెడికల్ ఖర్చులకు రూ. 25 వేలకు పెంచాలి. ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా యథావిధిగా కొనసాగిస్తూనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రకటించిన గీతన్న బీమా అమలు చేయాలి. తరతరాల నుండి ఏజెన్సీ ఏరియాలో జీవనం గడుపుతూ కల్లు గీత వృత్తి చేస్తున్న గౌడలకు సొసైటీలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి. సంక్షేమ పథకాలు వారికి వర్తింపచేయాలి. తాటి, ఈత చెట్లు నరికినవారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కొత్త చట్టం తీసుకురావాలి. కల్లుగీత వృత్తిదారులకు ఇస్తున్న పెన్షన్ రూ. 5 వేలకు పెంచాలి. పై సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 22 న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా జరిగింది. రాష్ర్ట వ్యాప్తంగా స్వచ్ఛందంగా వేలాది మంది గీత కార్మికులు తరలివచ్చారు.