Monday, January 20, 2025

కాళోజీ కళా క్షేత్రం ప్రారంభం వాయిదా

- Advertisement -
- Advertisement -
  • 9న వరంగల్‌లోనే కాళోజీ అవార్డుల ప్రదానం
  • ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్

హన్మకొండ ప్రతినిధి: నేటి వరకు వర్షాలు ఉన్నందున హన్మకొండలో నిర్మించిన కాళోజీ కళా క్షేత్రం ప్రారంభోత్సవం వాయిదా పడినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. గురువారం కుడా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కుడా ఛైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్‌తో కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో చీఫ్ విప్ మాట్లాడుతూ.. తాత్కాలికంగా కాళోజీ కళా క్షేత్రం వాయిదా పడినా త్వరలోనే సీఎం, మంత్రుల తేదీలతో ప్రారంభం ఘనంగా జరుపుకుంటామన్నారు.

9న కాళోజీ జయంతి సందర్భంగా హరిత కాకతీయ హోటల్‌లో కాళోజీ పేరిట ఏర్పాటుచేసిన పురస్కారానికి ప్రజా కవిత జయరాజ్‌కు అందచేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం, పేదల కోసం తపించిన కాళోజీ నారాయణరావును తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి గొప్పగా చూస్తున్నారన్నారు. కాళోజీ ఆకాంక్షల ప్రకారం సాకారమైన తెలంగాణలో కాళోజీ గౌరవాన్ని మరింత పెంచేలా సీఎం కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కేసీఆర్ సీఎం కాగానే కాళోజీ శత జయంతి సందర్భంగా వరంగల్‌కు రూ.50 కోట్లతో 2.25 ఎకరాల్లో రాష్ట్రంలో అతిపెద్ద కళా కేంద్రాన్ని నిర్మించేందుకు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారన్నారు.

కాళోజీని అన్ని తరాలు గుర్తుంచుకునేలా రాష్ట్రంలోనే ఏకైక హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు పేరు పెట్టారన్నారు. కాళోజీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రఖ్యాత కళాకారులకు అవార్డు ఇస్తుందన్నారు. కాళోజీ కళా క్షేత్రం నిర్మాణం వేగవంతమైందని, త్వరలోనే పూర్తవుతుందన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ఈనెల 9న హరిత హోటల్‌లో ఉదయం కాళోజీ అవార్డు ప్రధానం, మధ్యాహ్నం కవి సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో కుడా ఛైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్, రాష్ట్ర రుణ విమోచన కమిషన్ ఛైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నగర కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా, కవులు, రచయితలు పాల్గొన్నారు. కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు అంపశయ్య నవీన్, వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, అశోక్‌కుమార్, కుడా పీఓ అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News