Thursday, January 23, 2025

ప్రజా ఉద్యమకారుడు కాళన్న

- Advertisement -
- Advertisement -

Article about Public poet Kaloji Narayana Rao life story

అన్యాయం ఎక్కడ జరిగినా.. దానికి వ్యతిరేకంగా గళమెత్తే గొంతుల్లో నుంచి కాళోజీ గొంతు గర్జనగా వినిపించింది. అసమానతలకు, దోపిడీకి, నిరాదరణకు గురవుతున్న వారిలో కాళోజీ కలం చైతన్యాన్ని నింపింది. ప్రశ్నించేతనాన్ని తట్టి లేపింది. కాళోజీ రాసిన ఒక్కో పదం వారిలో పోరాట స్ఫూర్తిని నింపే నిప్పుకణం. ఆయన ప్రతి అడుగులోనూ న్యాయం వైపే నిలిచారు.అన్యాయంపైన పోరాటం చేశారు. జీవితాంతం ప్రజల గొంతుకై నిలిచిన ప్రజాకవి కాళోజీలో గొప్ప పోరాటయోధుడు ఉన్నాడు. చిన్ననాటి నుంచి చివరి రోజుల వరకు కాళోజీ జీవితంలో ప్రతీ పేజీ ఒక పోరాటమే. కాళోజీ నా గొడవ ఆయన వ్యక్తిగతం కాదు. సమాజం గొడవే తన గొడవ.
అవనిపై జరిగేటి అవకతవకలు జూసి/ ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు/పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె/మాయమోసము జూసి మండిపోవును ఒళ్లు/పతిత మానవు జూచి చితికిపోవును మనసు/ ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?
అంటూ తన హృదయాన్ని ఆవిష్కరించుకున్న కాళోజీ.. ఈ లోకంలో జరిగే అన్ని అన్యాయాలపైనా మానవీయ కోణంతో స్పందించేవారు. కలానికి పని చెప్పేవారు. గళం విప్పి పోరాటగొంతుకయ్యేవారు. ఈ క్రమంలో ఆయన జైలు జీవితాన్నీ అనుభవించారు. అనేక నిర్బంధాలను చవిచూశారు. అవేవీ ఆయన ధైర్యాన్ని, సంకల్పాన్ని అణువంతైనా తగ్గించలేకపోయాయి.
‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి/ అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి/ అన్యాయాన్నెదిరించినోడు నాకు ఆరాధ్యుడు’ అని తన వైఖరిని ప్రకటించి మరీ పోరాటాల్లో నిలిచారు కాళోజీ. చిన్ననాటి నుంచి చైతన్యాన్ని ఒంటబట్టించుకున్న కాళోజీ విద్యార్థి దశలోనే ఉద్యమాలు ప్రారంభించారు. నిజాం నిరంకుశం పాలనకు వ్యతిరేకంగా వరంగల్లో విద్యార్థి నాయకుడిగా కాళోజీ అనేక నిరసనలు చేశారు. నిరసనలను అణచేయడానికి ఆనాటి పాలకులు పెట్టిన అన్ని నిర్బంధాలను ఆయన ఛేదించారు. ఆర్య సమాజ్ ఉద్యమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనే వారు. సమాజంలో ప్రజల మధ్య అగాధం ఏర్పడుతున్నప్పుడు కాళోజీ వేగంగా స్పందించేవారు. విభజించి పాలించాలనే దురుద్దేశంతో మతాల మధ్య పాలకులు పెట్టే చిచ్చును ఆర్పేసేవారు. అందరూ కలిసిమెలిసి జీవించే సోదరతత్వాన్ని ప్రజల్లో నింపేవారు. అందుకే.. ఇదేంది? పోచమ్మ గుడి దగ్గర హిందూ ముస్లింల మధ్య గొడవ జరిగే నువ్వే ఉంటవ్, గణపతి ఉత్సవాల దగ్గరా నువ్వే ఉంటవ్, పౌరహక్కుల సమావేశాల్లో నువ్వే ఉంటవ్, ఆర్య సమాజం దగ్గరా నువ్వే ఉంటవా? అని పోలీసులు కాళోజీని అడిగేవారు. కాళోజీకి పార్టీలు, భావజాలాలు లేవు. ఈ ఛట్రాల్లో ఆయన ఎప్పుడూ లేరు. అన్యాయాన్ని ఎదిరించడమే ఆయన ఏకైక సిద్ధాంతం.
ప్రజా హక్కులకు భంగం కలిగే ఏ చర్యనైనా కాళోజీ వ్యతిరేకించే వారు. పౌర హక్కుల ఉద్యమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్ర మహాసభల్లోనూ కాళోజీ ముందు వరుసలో పాల్గొనేవారు. 1935లో షాద్‌నగర్‌లో జరిగిన 5వ ఆంధ్ర మహాసభలో కాళోజీ పాల్గొని తన సామాజిక జీవితంలో మొదటి ప్రసంగం చేశారు. ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయినప్పుడు రెండు మహాసభలకూ కాళోజీ హాజరయ్యేవారు. అంటే, లక్ష్యం ఒక్కటే అయినప్పుడు రాజకీయ భేదాలు, అభిప్రాయభేదాలు పట్టించుకోవద్దనేది కాళోజీ ఆలోచనా విధానం. అందరూ వ్యతిరేకించినా సరే తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పడం, మొండిగా ఉండటం కాళోజీ నైజం. ఓసారి భువనగిరిలో ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టులు, సభలో హేమాహేమీల అభిప్రాయాలకు విరుద్ధమైన తీర్మానాన్ని కాళోజీ చేయగా అది ఓడిపోయింది.అయినా కాళోజీ వెనక్కు తగ్గలేదు. జనరల్ బాడీలో ఓటింగ్‌కు పెట్టారు. ఇక్కడా కాళోజీ తీర్మానం ఓడింది. కానీ, ఆయన మనస్సు, ఆలోచన మాత్రం మారలేదు. తన వాదన అందరికీ చేరిందా లేదా అనేదే కాళోజీ భావన.
నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని అకారణంగా నిర్బంధించ సాగింది. ఇందులో భాగంగానే 1939లో కాళోజీ మొదటిసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైలు జీవితం కాళోజీ ధైర్యాన్ని మరింత రాటుదేల్చింది. ఓసారి ఆయన వరంగల్ చౌరస్తాలో నిలబడి మరీ నిజాంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కరపత్రాలు పంచారు. బ్రిటీష్‌కు నువ్వు తొత్తువు.. తొత్తు కింద తొత్తులుగా మేము బతకదల్చుకోలేదు అంటూ సూటిగా నిజాంకు అల్టిమేటం లాంటి మాటలను కాళోజీ ఆ కరపత్రాల్లో రాశారు. 15 నిమిషాల్లో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో తాను చేసిన పనిని కాళోజీ ధైర్యంగా ఒప్పుకున్నారు. కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ సమయంలో అనారోగ్యం బారిన పడిన కాళోజీని విడిపించేందుకు ఆనాటి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నించారు. అయితే, నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకించే చర్యలేవీ చేయనని హామీ ఇస్తే వదులుతామని ప్రభుత్వం షరతు విధించింది. ఈ షరతును నిర్ద్వంద్వంగా నిరాకరించి జైలులో ఉండేందుకే నిర్ణయించుకున్నారు. అయితే, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కొందరు పెద్దలు కాళోజీని ఒప్పించి శిక్షా కాలంలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇప్పించడంతో జైలు నుంచి బయటకు వచ్చారు.
నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందున కాళోజీని వరంగల్ నుంచి నగర బహిష్కరణకు చేశారు. దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలోనే కొనసాగుతున్న సమయంలో హనుమకొండలో జాతీయ జెండా ఎగరేశాడని మరోసారి కాళోజీని అరెస్టు చేసి జైలుకు పంపించారు. మహాత్మ గాంధీ మరణించిన సమయంలో జైలులోనే కాళోజీ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. జైలులోనే సంతాప సభ జరిపారు. కాళోజీని విడుదల చేస్తున్నప్పుడు.. రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీని జైలులో వేస్తున్నారా? అని జైలర్‌ను ప్రశ్నించారు కాళోజీ. ఖాసీం రజ్వీ, మేము బయట ఉండటం పొసగదు.. ఒకరు నిర్బంధంలో ఉంటే.. ఇంకొకరు బయట ఉండాలని చెప్పారు కాళోజీ. జైలులో సైతం ఆయన మానవీయంగా ఆలోచించేవారు. ఖైదీలకు జబ్బు చేస్తే మంచి చికిత్స అందించాలని, రొట్టె బదులు అన్నం పెట్టాలని మహాకవి దాశరథితో కలిసి కాళోజీ సత్యాగ్రహం చేసి డిమాండ్లు సాధించారు. జాతీయోద్యమాల ప్రభావం కూడా కాళోజీపైన ప్రతి సందర్భంలో ఉండేది. గాంధీజీని ఆదర్శంగా తీసుకునే కాళోజీ శాంతియుత మార్గంలోనే ఉద్యమాల్లో పాల్గొన్నారు. దేశ స్వాతంత్య్రానికి ముందు ప్రజలు, రాజకీయ శక్తుల మధ్య వచ్చిన విభజనను కాళోజీ జీర్ణించుకోలేకపోయారు.
‘భలేవారయా భారతీయులు.. మీలో మీకు మిత్రత లేక/ జాతి వైరములు సమాజ కక్షలు.. భాష తగాదల్ ప్రాంత భేదములు/ ఒకరి నమ్మకం ఒకరికి లేదు.. ఒకరి కోర్కె ఇంకొకరికి గిట్టదు/ ఏకత లేక ఎవరికి వారే.. ప్రభుత్వమిమ్మని ప్రాకులాడెదరు’ అంటూ గేయం రాశారు.
ఉద్యమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కాళోజీ గెలుపోటములతో సంబంధం లేకుండా తన పోరాటం తాను చేశారు. 1951 – 52లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారు. నిజానికి సాయుధ పోరాట ప్రభావంతో ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయాలు సాధించారు. కాళోజీ మాత్రం వరంగల్లో కమ్యూనిస్టులకు గట్టి పోటీ ఇచ్చి 4 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడారు. వరంగల్లో కాళోజీకి ప్రజల్లో ఉన్న పలుకుబడికి ఆ ఎన్నిక నిదర్శనం. తర్వాత 1958లో ఏర్పడిన మొదటి శాసనమండలికి ఉపాధ్యాయుల తరపున కాళోజీ ఎన్నికయ్యారు. 1960, 1962లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడారు. ఓటిమికి వెనకడుగు వేసే స్వభావం కాదు కాళోజీది. 1978లో ఏకంగా సత్తుపల్లికి వెళ్లి మరీ జలగం వెంగళరావుపై పోరాటం చేసిన ధైర్యం కాళోజీది. ఓడిపోతమన్న భయం అనేదే కాళోజీ జీవితంలో లేదు. తన పోరాటం తాను చేసే వారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగే అన్ని చర్యలనూ కాళోజీ నిర్ద్వంద్వంగా ఖండించేవారు. ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా కాళోజీ గళం విప్పారు. అప్పుడు జరిగిన ప్రపంచ ప్రథమ తెలుగు మహాసభల సన్మాన ఆహ్వానాన్ని కాళోజీ తిరస్కరించారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు కూడా కాళోజీ ప్రతిఘటించారు. పౌర హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యనూ కాళోజీ ఖండించారు. వాటికి వ్యతిరేకంగా మేధావులను ఒక్కటి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రతి సందర్భంలోనూ కాళోజీ ఖండించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలని ఆకాంక్షించారు. తన కలంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారు. కాళోజీ జీవితమంతా పోరాటమే.ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా కాళోజీ దానికి వ్యతిరేకంగా గళమెత్తారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో న్యాయం ఉందని భావించిన కాళోజీ అక్కడి ప్రజల పోరాటానికి మద్దతుగా కూడా రాశారు. అందుకే, ప్రపంచం గొడవ అంతా తన గొడవ అనుకున్నారు కాళోజీ. అందుకే, మన తెలంగాణ ప్రజల గుండెల్లో కాళన్నగా చిరస్థాయిలో నిలిచిపోయారు.

డా. ఎన్. యాదగిరి రావు
(అడిషనల్ కమిషనర్
జిహెచ్‌ఎంసి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News