రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, మహిళా రిజర్వేషన్లపై కీలకోపన్యాసం చేయనున్న కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై లండన్‌లో ఏర్పాటు చేయబోయే సమావేశంలో కీలకోపన్యాసం చేయవలసిందిగా పబ్లిక్ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది. పార్లమెంట్ పాస్ చేసిన మహిళ రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసిన సందర్భంగా లండన్‌లో అక్టోబర్ 6వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆహ్వాన పత్రంలో పేర్కొంది.
రాజకీయాల్లో, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి కవిత విశేషంగా కృషి చేశారని ఆ సంస్థ ప్రశంసించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అనేక ఆందోళన కార్యక్రమాలను చేపట్టారని, వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారని వివరించింది. ఇలా పలు రకాల కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చను రేకెత్తించారని పేర్కొంది. జంతర్ మంతర్ వద్ద దాదాపు 6 వేల మందితో ధర్నా నిర్వహించారని, ఈ ధర్నా కార్యక్రమానికి 18 పార్టీల నేతలు హాజరైన మద్దతు ప్రకటించారని తెలిపింది. మహిళా రిజర్వేషన్ల ఆవశ్యకతపై ఢిల్లీలో భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 13 రాజకీయ పార్టీలతో పాటు మహిళా, విద్యార్థి, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారని గుర్తు చేసింది.