Saturday, November 23, 2024

కల్వకుర్తిలో హస్తం అస్తవ్యస్తం

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి ః దశాబ్దాల కాలంగా దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన పార్టీగా కాంగ్రెస్ పార్టీది ఘనమైన చరిత్ర. స్వాతంత్రం అనంతరం భారతదేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో పేరుంది అయితే అది గడిచిన చరిత్ర. ఒకనాడు వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు దేశంలో, రాష్ట్రంలో గెలుపుకోసం విశ్వప్రయత్నం చేస్తోంది. దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడానికి ప్రయత్నం ముమ్మరం చేస్తుంది. కర్ణాటక రాష్ట్రం ఎన్నికల ఫలితాలు, పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం తెలంగాణ కాంగ్రెస్‌లో కొంత ఊపు నింపినప్పటికి కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీలో మాత్రమే పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.

కల్వకుర్తిలో మెజారీటి గెలుపు కాంగ్రెస్‌దే
కల్వకుర్తి నియోజకవర్గంలో 2014 వరకు 17 సార్లు శాసన సభ ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ పది పర్యాయాలు విజయం సాదించిన కాంగ్రెస్ పార్టీది కల్వకుర్తిలో మెజార్టీ గెలుపు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్నప్పటికి నాయకత్వ లేమితో పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందని ప్రజలు పేర్కొంటున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసి విజయం సాధించిన ప్రస్తుత ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమి చెందారు. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారనే విమర్శలు కార్యకర్తల నుంచి బాహాటంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐసిసి కార్యదర్శిగా నియమితులైన వంశీచంద్ రెడ్డి జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో నియోజకవర్గానికి సమయం ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.

సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేరికతో కార్యకర్తలో జోష్
ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గత నెలలో ఏఐసిసి పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొన్ని నెలల కాలంగా ఆయన ఐక్యత ఫౌండేషన్ పేరుతో గ్రామాల్లో విద్యా, ఉద్యోగం, ఉపాధి కల్పన లక్షంగా నియోజకవర్గంలో విరివిగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో గుడులకు, బడులకు విరివిగా విరాళాలు ఇచ్చారు. అంతేకాకుండా అనారోగ్య బాధితులకు, చనిపోయిన కుటుంబాలకు ప్రమాద క్షతగాత్రులకు విరివిగా ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐక్యత ఫౌండేషన్‌తో గ్రామాల్లో విరివిగా పర్యటనలు చేస్తూ ఇప్పటికే నియోజకవర్గాన్ని మొత్తం కలియ తిరిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చింది. సుంకిరెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నూతన జోష్ పెరిగిందని పార్టీ వర్గాలు, గ్రామీణ కార్యకర్తలు సైతం పేర్కొంటున్నారు.

కల్వకుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు..అయోమయంలో కార్యకర్తలు
ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గత నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన కల్వకుర్తి నియోజకవర్గంలో భారీగా వాహన ర్యాలీ చేరికల కార్యక్రమాలు చేపట్టారు. అయితే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి వర్గీయులెవరు పాల్గొనలేదు. దీంతో వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ మధ్యన అంతర్గత వైర్యం నడుస్తుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. సుంకిరెడ్డి, వంశీచంద్ రెడ్డిల మధ్య కార్యకర్తలు ఎవరి వైపు వెళ్లాల్లో అనే అయోమయ స్థితిలో ఉన్నారు. ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను 2023 శాసన సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉండేది మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డినా లేక ఇటీవల చేరిన ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డినా అనేది తేలక పార్టీ నాయకత్వంలో, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News