నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ శుక్రవారం విడుదల కానుంది. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌పై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
కొత్తగా ఉందనిపించింది…
టైమ్ ట్రావెల్ , ఫాంటసీ ఎలిమెంట్స్‌తో దర్శకుడు వశిష్ట్ చెప్పిన స్క్రిప్ట్ వినగానే నచ్చేసింది. కొత్తగా ఉందనిపించింది. ఇలాంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందనిపించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఎలా ఉండాలి, గెటప్ ఎలా ఉండాలి అని దర్శకుడు వశిష్ట్‌తో చర్చించి ‘బింబిసార’ టైటిల్ అనుకున్నాం.
ఫైనల్‌గా ఈ గెటప్…
ఈ సినిమా ద్వారా ఒక కొత్త క్యారెక్టర్ చేయగలిగాను. అద్భుతమైన కథ వచ్చేసింది కానీ రాజుగా నేను సెట్ అవుతానా? అనే సందేహం కలిగింది. ముఖ్యంగా ప్రభాస్ ఒక మార్క్ క్రియేట్ చేసి రాజు అంటే ఇలా ఉండాలని చూపించాడు. ఇక ఈ సినిమాలో పాత్ర కోసం నా హైట్‌కి తగ్గట్టే బరువు బాగా తగ్గించేసి వర్కవుట్స్ చేశాను. అలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఫైనల్‌గా ఈ గెటప్ ఫిక్స్ అయ్యాం.
ఫాంటసీ ఎలిమెంట్స్‌తో…
ఒక రాజు కథ అంటే యుద్ధాలతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఆశిస్తారు. కానీ ఇందులో అలాంటివి డిజైన్ చేయలేదు. ఈ సినిమాలో బింబిసారుడి కథ మాత్రమే చూపించాం. కాకపోతే విఠలాచార్య సినిమాలో కనిపించే దెయ్యాలు, భూతాలు వంటి కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి.
కథే నన్ను ఎంచుకుంది…
నిజానికి కొన్ని కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అది నేను నమ్ముతాను. ‘అతనొక్కడే’ కథ చాలా మంది హీరోలు విన్నారు. కానీ నేను చేశాను. ఎందుకంటే ఆ కథ నాకు రాసుంది కాబట్టి. అలాగే బింబిసార కథ కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చిందని భావిస్తున్నాను. లేదంటే రాజుగా నేను ఒక సినిమా చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆ ఆలోచనే లేదు.
బాలయ్యతో సినిమా చేస్తా…
ఎన్టీఆర్ ఆర్ట్‌లో బాలయ్య బాబాయ్‌తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుండో ఉంది. ఆ మధ్య ఆయనకి ఓ కథ కూడా వినిపించడం జరిగింది. కానీ సెట్ కాలేదు. కథ బాగుంటే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే బాబాయ్‌తో ఒక సినిమా చేస్తాను.
‘బింబిసార 2’ కథ సిద్ధం..
ఈ సినిమాకు సంబంధించి ఇంకా సీక్వెల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ‘బింబిసార’ రెండో భాగానికి కథ సిద్ధంగా ఉంది. మొదలు పెట్టడమే ఆలస్యం. ఈనెల 5 తర్వాత ‘బింబిసార 2’ వివరాలు చెబుతాను.
అందుకే ‘ఎన్టీఆర్ 30’ ఆలస్యం…
తారక్ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. గ్లోబల్ యాక్టర్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఒక బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చే నెక్స్ సినిమా అంటే కాస్త సమయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రేక్షకుల అంచనాల మేరకు ‘ఎన్టీఆర్ 30’ సినిమాతో రావాలని చూస్తున్నాం. అందుకే ఈ సినిమా ఆలస్యమవుతోంది.
Kalyan Ram interview about ‘Bimbisara’