సినిమా ఎవ్వరి కంటే కూడా పెద్దదని, తాను నిత్య విద్యార్థిగానే ఉంటానని ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోమవారం ప్రకటించారు. తనకు ప్రదానం చేసిన లోక నాయకుడు (ఉలగ నాయగన్) వంటి బిరుదులను అన్నిటినీ త్యజిస్తున్నానని ఆయన వెల్లడించారు. తనను తన పేరుతో పిలిస్తే చాలునని కమల్ హాసన్ సూచించారు. కమల్ హాసన్ ఈ మేరకు అభిమానులను ఉద్దేశించి ఒక సుదీర్ఘ లేఖ రాశారు. పేరుకు ముందు బిరుదులు ఏవీ వద్దని ఆయన సూచించారు. లోక నాయకుడు, ఇంకా ఇతర బిరుదులతో తనను పిలుచుకుంటూ ఎంతో ప్రేమ ప్రదర్శించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అయినప్పటికీ ఇకపై బిరుదులను తన పేరు ముందు చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని కమల్ హాసన్ స్పష్టం చేశారు.
ఎందుకంటే, సినీ రంగంలో తనను తాను నిత్య విద్యార్థిగానే భావిస్తానని, ఎప్పటికీ నేర్చుకుంటూపే ఉంటానని ఆయన తన లేఖలో వినమ్రంగా పేర్కొన్నారు. సినిమా రంగం అనేది అందరికీ చెందుతుందని, లెక్కలేనంత మంది కళాకారుల సహకార ఫలితమే సినిమా రంగం అని ఆయన పేర్కొన్నారు. టెక్నీషియన్లు, ప్రేక్షకులు కూడా సినిమా రంగంలో భాగమేనని, కళను మించి తాను గొప్పవాడినని కళాకారుడు ఎప్పుడూ అనుకోరాదని, అందుకే తాను ఎంత ఎదిగినా కళామతల్లి ముందు ఒదిగి ఉండాలని భావిస్తానని కమల్ హాసన్ వివరించారు. ఈ క్రమంలో తాను గొప్పవాడినని భావించలేనని, అందుకే అన్ని బిరుదులను తిరస్కరిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని సంవత్సరాల సినీ ప్రస్థానంలో తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నవారందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని కమల్ హాసన్ వెల్లడించారు.