Saturday, November 23, 2024

కాంగ్రెస్ యాత్రలో కలిసిన నటుడు కమల్ హాసన్ !

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఢిల్లీ చేరుకుంది. కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పినప్పటికీ రాహుల్ గాంధీ తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇదిలావుండగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ నేడు ఆ యాత్రలో కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా రాహుల్ గాంధీతో కలిశారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ చేరడం ఇది రెండోసారి. ఇదివరకు అక్టోబర్‌లో ఆమె కర్నాటకలో ఈ మార్చ్‌లో కలిశారు.

ఈ భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీలోకి తెల్లవారు జామున ఫరిదాబాద్ నుంచి ప్రవేశించింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి, రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్వేష విపణిలో (నఫ్రత్ కా బజార్), ప్రేమ అంగడీ(మొహబత్ కీ దుకాణ్)ని తెరవడమే ఈ యాత్ర ఉద్దేశమని అన్నారు. “ దేశంలో సామాన్యులు ప్రేమ గురించే మాట్లాడుతున్నారు. ప్రతి రాష్ట్రంలో లక్షలాది మంది ఈ యాత్రలో చేరారు” అని రాహుల్ గాంధీ తెలిపారు. తన ఈ యాత్ర లక్షం ‘అసలైన భారత్’ ను చూపడమేనని, వారు(ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి) ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని, తాము మాత్రం ప్రేమను వ్యాపింపజేస్తున్నామని అన్నారు.

దీనికి ముందు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ “కొవిడ్ ప్రోటోకాల్స్’ పాటించండి” అని రాహుల్ గాంధీకి రాశారు. ‘బిజెపి తమ యాత్రను ఆపడానికే అలా చేస్తోంది’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఇదిలావుండగా ఈ రోజు సాయంత్రం ఎర్ర కోట వద్ద యాత్ర ముగుస్తుంది. కాంగ్రెస్ ఈ మెగా మార్చ్ తొమ్మిది రోజులు విరామం తీసుకుని జనవరి 3న ఢిల్లీ నుంచి తిరిగి మొదలవుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News