Saturday, November 2, 2024

జమిలి ఎన్నికలు ప్రమాదకరం: కమల్ హాసన్

- Advertisement -
- Advertisement -

ఒక దేశం, ఒకే ఎన్నికలు ప్రతిపాదన ప్రమాదకరం, లోభూయిష్టమని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికల గుర్తులు ఇంకా కొన్ని దేశాలలో ఉన్నాయని, భారత్‌కు అవి అవసరం భవిష్యత్తులో కూడా లేదని శనివారం నాడిక్కడ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు. 2014 లేదా 2015లో జమిలి ఎన్నికలు జరిగి ఉంటే ఒక పార్టీ అన్ని స్థానాలను చేజిక్కింయుకుని ఉండేదని, అది నియంతృత్వానికి, వాక్ స్వాతంత్య్రాన్ని హరించి ఉండేదని, ఒక నాయకుడి ఆధిపత్యానికి దారితీసి ఉండేదని ఏ పార్టీని పేరు పెట్టి ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి నుంచి మనం తప్పించుకున్నామంటూ ఆయన తెలిపారు. ఒకే సమయంలో అన్ని రంగుల ట్రాఫిక్ లైట్లు వెలిగితే ఏం జరుగుతుందని జమిలి ఎన్నికలను ప్రస్తావిసూ ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి తమ ప్రతినిధిని ఎంచుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన చెప్పారు.

రాజకీయాల్లోకి రావద్దని తనకు కొందరు సలహాలు ఇచ్చారని, బిగ్ బాస్ షోను హోస్ చేయవద్దని కూడా తనకు సూచించారని కమల్ చెప్పారు. ప్రజలను కలుసుకుని, వారితో మమేకమయ్యేందుకు దారి తీసే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. తనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి స్టేజీపైనే ఉన్నానని, తనకు ప్రజలతో మమేకం కావడం కొత్తేమీ కాదని ఆయన తెలిపారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ నటుడిని నిర్మాతలు వద్దంటారని, అదే ఒక రాజకీయ నాయకుడు విఫలమైనా ప్రజలు గుర్తుపెట్టుకుంటారని ఆయన అన్నారు. తనను తాను విఫల రాజకీయ నాయకుడిగా వర్ణించుకుంటానని ఆయన తెలిపారు. వైఫల్యం శాశ్వత స్థితి కాదని, ప్రధాన మంత్రి పదవి కూడా శాశ్వత స్థితి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి బలమైన ప్రజాస్వామ్య స్వరూపాన్ని ఇచ్చారని, దాన్ని కూలపదోయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఫలించబోవని ఆయన స్పష్టం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాత తమిళనాడులో పార్లమెంటరీ స్థానా ల సంఖ్య తగ్గే ప్రమాదముందన్న వాదనపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో ప్రస్తుతం 39 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు తమిళనాడుకు శిక్ష విధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదంటూ చేస్తున్న విమర్శను ఆయన ఖండించారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో డిఎంకె కూటమిలో చేరిన కమల్ హాసన్ పార్టీకి 2025లో ఒక రాజ్యసభ సీటును ఇస్తామని డిఎంకె హామీ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News