తమిళనాట సినీ స్టార్లు పార్టీలు పెట్టడం కొన్ని దశాబ్దాల క్రితమే మొదలైంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి రచయితలు, నటీనటులు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. దివంగత విజయ్ కాంత్, కమల్ హాసన్ కూడా పార్టీలు పెట్టారు. తాజాగా ఈ జాబితాలోకి హీరో విజయ్ వచ్చి చేరాడు. కొన్ని రోజుల క్రితం ‘తమిళ వట్రి కళగం’ పేరుతో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తన పూర్తి కాలాన్ని రాజకీయాలకే వెచ్చిస్తాననీ, ఇకపై సినిమాల్లో నటించననీ హీరో విజయ్ చేసిన ప్రకటనపై ఇప్పుడు తమిళనాట చర్చ సాగుతోంది. మక్కల్ నీటి మయ్యం పేరిట రాజకీయ పార్టీ పెట్టిన కమల్ హాసన్ రాజకీయాల్లో కొనసాగుతున్నా సినిమాలను మాత్రం విడచిపెట్టలేదు. దీనిపై విమర్శలు చెలరేగుతున్నాయి. హీరో విజయ్ లాగ కమల్ కూడా సినిమాలకు స్వస్తి చెప్పాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది.
దీనిపై తాజాగా కమల్ స్పందించారు. ‘రాజకీయంగా విజయ్ ను ప్రోత్సహించినవారిలో నేనూ ఒకడిని. ముందుగా అతనికి శుభాకాంక్షలు చెబుతున్నాను. రాజకీయాల్లో ఉండాలా, సినిమాల్లో ఉండాలా అనేది మా వ్యక్తిగతం. ఎవరి ఐడియాలజీ వాళ్లది. అతనిలాగ నేను ఉండాలని లేదు. నాలాగ అతనూ ఉండాలని లేదు. నా వరకూ నేను రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాల్లోనూ నటిస్తాను. ఇదే నా పద్ధతి’ అని కమల్ తేల్చి చెప్పాడు.