కొద్దిసేపు అమెరికా అధ్యక్ష బాధ్యతల్లో కమలాహారిస్
బెథెస్డా: మొదటిసారిగా నల్లజాతీయురాలైన కమలాహారిస్ అమెరికాకు తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. అధ్యక్షుడు జోబైడెన్‌కు పెద్దపేగుకు సంబంధించి కొలనోస్కోపీ నిర్వహించే సందర్భంగా అనెస్థీసియా(మత్తుమందు) ఇవ్వడంతో గంటా 25 నిమిషాలపాటు హారిస్‌కు అధ్యక్ష బాధ్యతల్ని బదిలీ చేశారు. భారతీయ మూలాలున్న హారిస్ దక్షిణాసియాకు చెందిన మొదటి వ్యక్తిగా కూడా రికార్డు నెలకొలిపారు. హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలన్నది తెలిసిందే. శనివారం బైడెన్ 78 నుంచి 79వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా అధికార బదిలీ ప్రక్రియ జరిగింది.
బైడెన్‌కు ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కెవిన్ ఓ కానర్ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం బైడెన్‌కు ఐదు గంటలకుపైగా పలు పరీక్షలు నిర్వహించారు. అనంతరం బైడెన్ ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉన్నారని, విధుల నిర్వహణకు ఆయన శరీరం అనుకూలంగా ఉన్నదని ఓ కానర్ తెలిపారు. అయితే, వయోభారానికి సంబంధించిన కొన్ని సమస్యలున్నాయన్నారు. బహిరంగ సమావేశాల్లో బైడెన్ మట్లాడుతున్నపుడు గొంతు సవరించుకోవడం, నడకలో తడబాటును ఇప్పటికే అమెరికన్లు గుర్తించారు. జీర్ణాశయంలో సమస్య వల్ల బైడెన్ తరచూ దగ్గడం, వెన్నునొప్పిఏడాది క్రితం ఆయన కాలికి గాయమవడంలాంటి సమస్యల వల్ల నడకలో తడబాటు కనిపిస్తున్నాయని ఓ కానర్ తెలిపారు.