Friday, December 20, 2024

బిసిల టికెట్‌లకు చెక్ పెట్టేలా కమ్మ సామాజిక వర్గం తెరపైకి ?

- Advertisement -
- Advertisement -

ఏఐసిసి నాయకులను కలిసిన కమ్మ నాయకులు
10 నుంచి 12 టికెట్లు ఇవ్వాలని డిమాండ్
తమను తొక్కేయడానికే కొందరు కుట్ర చేస్తున్నారని బిసి నాయకుల ఆరోపణ

మనతెలంగాణ/హైదరాబాద్: బిసి నాయకుల టికెట్‌లకు మరో సామాజిక వర్గం నాయకులు అడ్డుపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 30 నుంచి 40 సీట్లు కావాలని కాంగ్రెస్ పార్టీలో బిసి నాయకులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా వీరికి చెక్ పెట్టడానికి కమ్మ నేతలు సైతం తమ వర్గానికి కూడా భారీగా టికెట్‌లను కేటాయించాలని కోరుతూ అధిష్టానానికి విజ్ఞప్తి పెట్టుకున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే బిసి నాయకులు తమ కోటాకు ఎందుకు అడ్డువస్తున్నారంటూ కమ్మ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. ఇదంతా ఒక వర్గం కావాలనే చేస్తుందని, ప్రస్తుతం బిసిలకు ఎక్కువ సీట్లు రాకుండా అడ్డుకోవడానికే మధ్యలో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలను తెరపైకి తీసుకొస్తున్నారని కాంగ్రెస్‌కు చెందిన బిసి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం విశేషం.

ఏఐసిసి ప్రధాన కార్యదర్శిని కలిసిన కమ్మ నేతలు
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన జాబితా ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వరకు చేరింది. అయినా ఇంకా టికెట్ల పంచాయతీ కొలిక్కి రాకపోవడంతో రోజుకో కొత్త డిమాండ్ హస్తం పార్టీకి వస్తోంది. ఓ వైపు తమకు తగినన్ని టికెట్లు ఇవ్వాల్సిందే అని బిసి నేతలు పట్టుబడుతుండగా, కమ్మ నేతలు సైతం తమకు 10 నుంచి 12 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రస్తుతం ఈ పార్టీలో సంచలనంగా మారింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మ నేతలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ను కలిసి ఈ డిమాండ్‌ను తీసుకురావడంతో అధిష్టానానికి ఈ సమస్య కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టే విధంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొనడం విశేషం.

కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములు…
రాష్ట్రవ్యాప్తంగా 30 స్థానాల్లో గెలుపు,ఓటములను ప్రభావితం చేసే సత్తా తమకు ఉందని మరో 10 నియోజకవర్గాల్లోనూ తమ సామాజిక వర్గం బలంగా ఉందని కమ్మ నేతలు కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. కమ్మవారికి గతంలోనూ సరైన ప్రాధాన్యత దక్కలేదని అందువల్ల ఈసారి తప్పకుండా తగినన్ని సీట్లు కేటాయించి న్యాయం చేయాలని లెక్కలతో అధిష్టానానికి వారు వివరించినట్టుగా సమాచారం. కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే శేరిలింగపల్లి, కుత్భుల్లాపూర్, ఎల్బీనగర్, ఖమ్మం, మల్కాజ్ గిరి, కొత్తగూడెం, జూబ్లీహిల్స్, కోదాడ, పాలేరు, ఉప్పల్, రాజేంద్ర నగర్, కూకట్ పల్లి, పటాన్ చెరు, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉందని ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తమ వాదనను అధిష్టానం ఎదుట బలంగా వినిపించినట్టు సమాచారం. ఈ స్థానాలతో పాటు పినపాక, సత్తుపల్లి, మధిర, అశ్వరావుపేట, ఇల్లందు, వైరా, భద్రాచలం, ములుగు రిజర్వుడ్ స్థానాల్లోనూ తాము బలంగా ఉన్నామని, ఇక జనరల్ స్థానాలైన నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, సూర్యాపేట, ఖైరతాబాద్, సనత్ నగర్, మేడ్చల్‌లో గెలుపు, ఓటములు ప్రభావితం చేయగలిగే స్థాయిలో కమ్మ సామాజిక వర్గం ఉందని, మరో 10 స్థానాల్లో తాము బలంగా ఉన్నట్లు వారు వివరించడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News