Thursday, January 23, 2025

తెలంగాణలో అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు బాగుంది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన నేషనల్ కంపా సీఈఓ సుభాష్ చంద్ర, వివిధ రాష్ట్రాలకు చెందిన అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు శనివారం క్షేత్ర స్థాయి పర్యటనలో పాల్గొన్నారు. హైదరాబాద్ శివారు కండ్లకోయ అక్సీజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ తో పాటు, ఔటర్ రింగ్ రోడ్డు పచ్చదనం, ఎవెన్యూ ప్లాంటేషన్, తదితర అంశాలను పరిశీలించారు. అక్సీజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో సౌకర్యాలు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులను, నిబంధనల మేరకు వినియోగిస్తూ తెలంగాణ అటవీ శాఖ మంచి ఫలితాలు రాబడుతోందని నేషనల్ కంపా సీఈఓ సుభాష్ చంద్ర ప్రశంసించారు. ముఖ్యంగా అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు ప్రస్తుత పట్టణీకరణ పరిస్థితుల్లో చాలా ఉపయోగకరమైన కార్యక్రమం అన్నారు.

ఉత్తర ప్రదేశ్ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) సంజయ్ శ్రీ వాత్సవ మాట్లాడుతూ.. విపరీతమైన పట్టణీకరణ నేపథ్యంలో ప్రజలకు అవసరమైన స్వచ్చమైన ఆక్సీజన్ అందించేందుకు అర్బన్ పార్కులు లంగ్ స్పేస్ లుగా పనిచేస్తాయని, తెలంగాణ అటవీ శాఖ చొరవ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని వెల్లడించారు. మణిపూర్ పీసీసీఎఫ్ ఆదిత్య జోషి మాట్లాడుతూ తెలంగాణ అటవీ శాఖ పనితీరు చాలా ఆదర్శవంతంగా, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉందని అన్నారు. తమ రాష్ట్రంలో కూడా ఆక్సీజన్ పార్కు తరహాలో అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు పై గ్రీనరీ పరిశీలన

హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఔటర్​ రింగ్​ రోడ్డు (ఓఆర్​ఆర్​)పై సుమారు 70 కిలో మేటర్ల ఈ బృందం పర్యటించి పచ్చదనాన్ని పరిశీలించింది. కొత్తగా ఏర్పాటుచేస్తున్న డ్రిప్​ ఇరిగేషన్​ సిస్టెమ్​ను వివిధ రాష్ట్రాల పీసీసీఎఫ్​ లు అధ్యయనం చేశారు. ఇంటర్​ చేంజ్​ ల వద్ద ఉన్న గ్రీనరీ నిర్వహణ, ఓఆర్​ఆర్​ పై ఏర్పాటు చేసిన బొమ్మలను చూసి ముగ్దులయ్యారు. ఈ సందర్భంగా హెచ్​ఎండిఏ రూపొందించిన కాఫీ టేబుల్​ బుక్​, టేబుల్​ క్యాలెండర్​ లను అర్బన్​ ఫారెస్ట్రీ డైరెక్టర్​ డాక్టర్​ బి.ప్రభాకర్​ వారికి అందజేశారు. మరో నెలరోజుల్లో దాదాపు 160 కిలోమీటర్ల పొడవున ఓఆర్​ఆర్​ పై గ్రీనరీ నిర్వహణ కోసం డ్రిప్​ సిస్టెమ్​ అందుబాటులోకి వస్తుందని వారికి వివరించారు.

KAMPA National CEO Visit Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News