Monday, December 23, 2024

కామ్రేడ్ రంగమ్మ ఒక పోరాట దీప్తి

- Advertisement -
- Advertisement -

అది 1952 వ సంవత్సరం. హైదరాబాద్ స్టేట్‌లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రోజులవి. ఆ ప్రభుత్వంలో కొల్లాపూర్ శాసనసభ్యులు మందుముల నర్సింగరావు రెవెన్యూ మంత్రిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో కొల్లాపురం తాలూకా సాతాపూర్ గ్రామంలో ఒకానొక సభలో పాల్గొన్న మందుముల నర్సింగరావును నాటి తెలంగాణ రైతుల, రైతు కూలీల సమస్యలపై భూస్వాముల దౌర్జన్యాలపై సాయుధురాలైన ఉన్న ఒక మహిళ తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ సందర్భం ఆనాడే కాదు ఈనాటికి పాలమూరు జిల్లాలో ఒక సంచలనం. నాగరికతలేమి, అవిద్య, మూఢ విశ్వాసాలు సమాజాన్ని ముప్పేట బిగించి ఊపిరాడనీయకుండా చేస్తున్న ఆ కాలంలో ఒక స్త్రీ తుపాకీ చేతపట్టి ఒక మంత్రిని ప్రశ్నించిందంటే 75 ఏళ్ల క్రితం ఆమె ఎంతటి చైతన్యాన్ని కలిగి ఉండేదో మనకు అర్థమవుతుంది.

Also Read: విండీస్‌పై భారత్‌దే పైచేయి

సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆ మహాయోధురాలు ‘కమ్యూనిస్టు రంగమ్మ‘గా, ‘రంగక్క‘గా ప్రఖ్యాతి గాంచారు. పాలమూరు జిల్లా ప్రజా ఉద్యమాల చరిత్రలో ఆమెది ఒక అధ్యాయం. ఒక మొగలిగిద్ద శ్రీనివాసరావు, ఒక కందాల లక్ష్మణాచార్యులు వంటి వారితో కలిసి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆమె సాయుధ పోరాటాన్ని సాగించిన తీరు నేటికీ స్ఫూర్తిదాయకం. కామ్రేడ్ రంగక్క అసలు పేరు కె సత్యవతి. నల్లగొండ జిల్లా చివ్వెంలలో వెంకటమ్మ అప్పారెడ్డి దంపతులకు జన్మించారు. సత్యవతి బాల్యంలోనే సాయుధ పోరాటం పట్ల ఆకర్షితురాలైనారు. తమ పొలం వద్దకు వచ్చి ఆశ్రయం పొందే నాటి కమ్యూనిస్టుల చూసి ఆ ప్రేరణతో ఉద్యమం వైపు నడక సాగించారు. పోలీసుల దాడుల తప్పించుకోవడానికి ఆమె తన 13వ ఏటనే విజయవాడకు వెళ్లి అక్కడ కమ్యూనిస్టు పార్టీ వద్ద ఆశ్రయం పొంది ‘రంగమ్మ’ గా పేరు మార్చుకుని తుపాకీ చేతబట్టి నల్లమలను తన పోరాటానికి కార్యరంగంగా ఎంచుకున్నారు. నల్లమలలోని అమరాబాదు ప్రాంతంలో ప్రజలతో మమేకమై ఆమె సాయుధ పోరాటం చేశారు. ఆధిపత్య వాదులకు, భూస్వాములకు, దొరలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఆమె పేరు చెబితేనే ఆకాలంలో ఉలిక్కిపడేవారు.

కామ్రేడ్ రంగమ్మ 75 సంవత్సరాల క్రితం ఒక మహిళగా నల్లమల ప్రాంతాన్ని పోరాట వేదికగా చేసుకుని అచ్చంపేట, అమ్రాబాద్, కొల్లాపురం, లింగాల, పెద్దకొత్తపల్లి ప్రాంతాలలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రంగక్క తిరుగులేని పోరాటాలు చేశారు. చెంచులను, గిరిజనులను కూడగట్టి పోరాటం చేశారు. అటవీ అధికారుల దుర్మార్గాలను నిలువరించారు. బల్మూరులో జరిగిన ఒక దాడులలో పోలీసులకు ఎదురుపడి కాల్పులు జరిపిన ధీశాలి రంగమ్మ. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దుర్మార్గంగా లేవీ పేరుతో నిజాం సైనికులు కొల్లగొట్టిన ధాన్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని రైతులకు అప్పజెప్పారు. కామ్రేడ్ రంగక్క ఆనాడు పోలీసులకు, ప్రజా కంటకులకు, సింహ స్వప్నమయ్యారు. ఆమెను అంతం చేయాలని వారు పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. అయినా అడవుల్లో ఆకలి దప్పులకు తట్టుకొని ఉద్యమాన్ని కొనసాగించిన సాహసి ఆమె.ఆమెపై పోలీసులు 9 కేసులు నమోదు చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో రంగక్క ప్రభంజనాన్ని చూసి నాటి హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం ఆందోళన చెందింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ ‘నేడు మహబూబ్ నగర్ జిల్లాను ఒక లేడీ వణికిస్తున్నది’ అని ప్రకటించారంటే ఆమె పోరాట పటిమ ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చును. రంగమ్మను తుదకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక చేతికి బేడీలు, ఒక సంకలో చంటిబిడ్డతో ఆమెను నాగర్‌కర్నూల్ జైలుకు తరలిస్తుండగా వేలాది మంది పేద ప్రజలు ఆమె అరెస్టును ఖండించి బారులు తీరి మద్దతు పలికారు. ఇది కమ్యూనిస్టు ఉమ్మడి జిల్లా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించదగిన సందర్భం. నాగర్ కర్నూలు జైలులో నెల రోజుల పాటు వుంచిన ఆమె ఆ తర్వాత రాజకీయ ఖైదీగా మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించారు. జిల్లా జైలులో అక్కడి ఖైదీల దుర్భర స్థితులకు చలించి జైలు అధికారులకు ఎదురుపడి అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారు.

కామ్రేడ్ రంగక్క 90 ఏళ్ల వయసులో నల్లగొండ జిల్లా మండలం పెంచికల దిన్నె గ్రామంలో శేష జీవితాన్ని గడుపుతున్నారు. పోరాటమే జీవితంగా జీవితమే పోరాటంగా 75 ఏళ్లపాటు ప్రజా ఉద్యమాలతో మమేకమై, కమ్యూనిస్టు పార్టీలో కీలక భూమిక పోషించిన రంగక్క తన ఉద్యమ సహచరుడైన కా. నారాయణను వివాహం చేసుకున్నారు. కామ్రేడ్ రంగమ్మ 75 అరుణ వసంతాల పోరాట జీవితానికి ఈ సమాజం ఏమిచ్చినా ఆమె రుణం తీరదు. అయినా ఒక సంతృప్తి కోసం, ఒక సంతోషం కోసం, ఒక తరాన్ని ఈ తరానికి మళ్లీ పరిచయం చేయడం కోసం, ఆమె పోరాటాన్ని, ఆమె స్ఫూర్తిని, ఈ సమాజానికి పునఃపరిచయం చేయ డం కోసం నాగర్‌కర్నూల్ జిల్లా సి.ఎన్.ఆర్ విద్యాసంస్థలు 2023 సంవత్సరానికిగాను చింతలపల్లి నిర్మలాదేవి నారాయణరావు స్మృత్యర్థం నెలకొల్పిన జీవన సాఫల్య పురస్కారం కింద రూ. 25000 నగదు రూపకంగా కామ్రేడ్ రంగక్కకు బహుకరించడం గర్వకారణం.

వనపట్ల సుబ్బయ్య
9492765358

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News